పెనాల్టీ షూటౌట్... అప్పటికే బ్రెజిల్ 2–4తో వెనుకబడి ఉంది. నాలుగు ప్రయత్నాల్లోనూ క్రొయేషియా స్కోరు చేయగా, బ్రెజిల్ రెండు సార్లే సఫలమైంది. ఇలాంటి సమయంలో మార్కినోస్ పెనాల్టీ తీసుకున్నాడు. స్టేడియం మొత్తం ఉత్కంఠ, ఈ షాట్ సరిగా పడకపోతే... ఏం జరుగుతుందో అతనికి బాగా తెలుసు... గోల్‌పోస్ట్ కుడి వైపు గురి పెడుతూ మార్కినోస్ కిక్ కొట్టాడు. క్రొయేషియా గోల్ కీపర్ లివకోవిచ్ ఎడమ వైపు దూకాడు... దాంతో బంతి లక్ష్యం చేరినట్లే అనిపించింది. కానీ నేరుగా గోల్ పోస్ట్‌కు తాకి వెనక్కి వచ్చింది ! అంతే...మార్కినోస్ కుప్పకూలిపోగా, బ్రెజిల్ ఆటగాళ్లంతా అచేతనంగా ఉండిపోయారు. మరోసారి హీరోగా మారిన లివకోవిచ్‌ను చుట్టుముట్టి క్రొయేషియా సంబరాల్లో మునిగిపోగా, స్టేడియంలో బ్రెజిల్ అభిమానుల గుండె పగిలింది. విషాదంతో నిండిపోయిన ‘సాంబా’ బృందం కన్నీళ్లపర్యంతమైంది. ఐదుసార్లు విజేత, టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ ప్రస్థానం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. వరుసగా ఐదో వరల్డ్ కప్‌లో రిక్త హస్తాలకే పరిమితమైన తమ జట్టు పరిస్థితిపై ఫ్యాన్స్ వేదన చూసి సగటు ఫుట్‌బాల్ అభిమానీ అయ్యో అంటూ బాధపడిపోయాడు!
దోహా: వరల్డ్‌కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు బ్రెజిల్ మరోసారి టైటిల్‌కు బహు దూరంలో నిలిచిపోయింది. గెలుపు అవకాశాలు సృష్టించుకున్నా, చివర్లో తడబాటుకు లోనై ఆపై షూటౌట్‌లో నిష్క్రమించింది. అవును...ఫిఫా వరల్డ్ కప్‌లో బ్రెజిల్ ఆట క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా పెనాల్టీలతో బ్రెజిల్‌ను మట్టికరిపించింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం కలిపిన తర్వాత ఇరు జట్టు ఒక్కో గోల్ చేసి 1–1తో సమంగా నిలిచాయి. దాంతో షూటౌట్ అనివార్యమైంది. ఇందులో 4–2 తేడాతో నెగ్గిన క్రొయేషియా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బ్రెజిల్ తరఫున నెమార్ (105+1వ నిమిషంలో) గోల్ కొట్టగా, క్రొయేషియా ఆటగాడు బ్రూనో పెట్‌కోవిచ్ (117వ నిమిషం)లో స్కోరు సమం చేశాడు.
హోరాహోరీగా...
తొలి అర్ధభాగంలో ఇరు జట్లు బంతిపై పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. బ్రెజిల్ కొంత దూకుడు కనబర్చినా, క్రొయేషియా పదునైన డిఫెన్స్‌తో నిలువరించగలిగింది. ముఖ్యంగా బ్రెజిల్ ప్లేయర్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రత్యర్థి తలవంచలేదు. మిడ్‌ఫీల్డర్లు బ్రొజోవిచ్, కొవాసిచ్, మోడ్రిచ్ అద్భుత ఆటతో బ్రెజిల్‌కు అవకాశం ఇవ్వకుండా వ్యూహాన్ని సమర్థంగా అమలు చేశారు. కీపర్ లివకోవిచ్ కూడా కీలక పాత్ర పోషించాడు. వినిసియస్ కొట్టిన షాట్‌ను అతను సమర్థంగా ఆపగలిగాడు. నెమార్ కూడా చురుగ్గా కదల్లేకపోవడం బ్రెజిల్‌కు ప్రతికూలంగా మారింది. రెండో అర్ధభాగంలో మాత్రం పరిస్థితి మారింది. నెమార్ కూడా లయ అందుకోగా రిచార్లీసన్ కూడా జత కలిశాడు.
అయితే 55వ నిమిషంలో రిచార్లీసన్ చేసిన ప్రయత్నాన్ని, 66వ నిమిషంలో పక్వెటా సృష్టించిన అవకాశంతో పాటు 76వ నిమిషంలో నెమార్ కొట్టిన కిక్‌ను కూడా లివకోవిచ్ నిర్వీర్యం చేయడం విశేషం. 90 నిమిషాల ఆటలో స్కోరు నమోదు కాకపోగా, ఆట అదనపు సమయానికి చేరింది. ఇందులో నెమార్ అద్భుత గోల్ బ్రెజిల్‌ను ముందంజలో నిలిపింది. క్రొయేషియా డిఫెన్స్‌ను ఛేదించి దూసుకుపోయిన అతను గోల్ కీపర్ తప్పించడంలో సఫలం కావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. కెరీర్‌లో 77వ గోల్‌తో అతను పీలే రికార్డును సమం చేయడం విశేషం. అయితే క్రొయేషియా వెంటనే కోలుకుంది. మరో నాలుగు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా మోర్సిచ్ అందించిన పాస్‌ను సూపర్ కిక్‌తో గోల్‌గా మలచడంలో పెట్‌కోవిచ్ విజయం సాధించాడు. ఈ ఆసక్తికర సమరం తుది ఫలితం మాత్రం చివరకు షూటౌట్‌తోనే తేలింది. వరుసగా రెండో వరల్డ్‌కప్‌లోనూ బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోనే ని్రష్కమించింది.
Comments
Please login to add a commentAdd a comment