ప్రపంచకప్-2023లో ఇవాళ (అక్టోబర్ 12) రసవత్తర సమరం జరుగనుంది. లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా తలపడనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ హోరాహోరీ పోరులో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో మ్యాచ్ ఆడాయి. సౌతాఫ్రికా శ్రీలంకపై ఘన విజయం సాధించగా.. ఆస్ట్రేలియా.. టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా ఏడో స్థానంలో నిలిచింది.
ఆస్ట్రేలియాదే పైచేయి..
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకు 6 సార్లు ఎదురెదురు పడగా.. ఆస్ట్రేలియా 3, సౌతాఫ్రికా 2 పర్యాయాలు విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్ టై అయ్యింది. ఈ ఇరు జట్లు చివరిసారిగా 2019 ప్రపంచకప్‌లో తలపడగా.. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది.
ఫేవరెట్‌గా సౌతాఫ్రికా..!
ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ ఎవరన్న విషయాన్ని పరిశీలిస్తే.. ప్రస్తుత ఫామ్ ప్రకారం సౌతాఫ్రికాయే అని చెప్పాలి. వరల్డ్‌కప్‌కు ముందు ఇరు జట్లు తలపడిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికానే కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సఫారీలు.. ఆతర్వాత ఆనూహ్యంగా పుంజుకుని వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ చేజిక్కించుకున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ సౌతాఫ్రికా అదే ఫామ్‌ను కొనసాగించింది.
శ్రీలంకతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు ప్రొటీస్ ఆటగాళ్లు సెంచరీలు చేశారు. ఫలితంగా ఆ జట్టు వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. ఆసీస్ విషయానికొస్తే.. వరల్డ్‌కప్‌కు ముందు సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైన ఆ జట్టు.. ఆతర్వాత భారత్‌తో జరిగిన సిరీస్‌ను కూడా 1-2తేడాతో కోల్పోయింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ ఆసీస్.. టీమిండియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోర్‌కే (199) పరిమితమైన ఆ జట్టు, దాన్ని కాపాడుకోవడం విఫలమైంది.
తుది జట్లు (అంచనా)..
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, టెంబా బవుమా (కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి
Comments
Please login to add a commentAdd a comment