CWC 2023: శ్రీలంకపై 5 వికెట్ల ప్రదర్శన.. షమీ ఖాతాలో పలు రికార్డులు | CWC 2023 IND VS SL: Shami Holds Most Five Wicket Haul Record In ODIs For Team India | Sakshi
Sakshi News home page

CWC 2023: శ్రీలంకపై 5 వికెట్ల ప్రదర్శన.. షమీ ఖాతాలో పలు రికార్డులు

Published Fri, Nov 3 2023 8:51 AM | Last Updated on Fri, Nov 3 2023 9:14 AM

CWC 2023 IND VS SL: Shami Holds Most Five Wickets Haul Record In ODIs For Team India - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన మొహమ్మద్‌ షమీ (5-1-18-5) పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇందులో వరల్డ్‌కప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు (14 మ్యాచ్‌ల్లో 45) ప్రధానమైంది కాగా.. వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధికసార్లు (4) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు (3) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు (7) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత వంటి పలు ఇతర రికార్డులు కూడా ఉన్నాయి.  

వరల్డ్‌కప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు..
షమీ నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్లు సాధించడం ద్వారా వరల్డ్‌కప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు (45) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో అతను.. జహీర్‌ ఖాన్‌ (23 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు), జవగళ్‌ శ్రీనాథ్‌ (34 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. షమీ ఈ ఘనతను కేవలం 14 మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం.

వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనత..
శ్రీలంకపై ఐదు వికెట్ల ప్రదర్శనతో షమీ వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో షమీ భారత్‌ తరఫున నాలుగోసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. గతంలో భారత బౌలర్లు జవగల్‌ శ్రీనాథ్‌, హర్భజన్‌ సింగ్‌ మూడు సార్లు ఈ ఘనత సాధించారు. 

వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనత..
షమీ నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్లతో చెలరేగడంతో వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు (3) ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్‌గా స్టార్క్‌తో పాటు రికార్డు షేర్‌ చేసుకున్నాడు. 

వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు..
నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్లు సాధించడంతో వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు (7) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌ ఏ బౌలర్‌ ఇన్నిసార్లు నాలుగు అంతకంటే ఎక్కవ వికెట్లు పడగొట్టలేదు. ప్రస్తుత ఎడిషన్‌లోనే నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం​ షమీకి ఇది మూడోసారి. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కేవలం 3 మ్యాచ్‌లు ఆడిన షమీ రికార్డు స్థాయి సగటుతో (6.71) 14 వికెట్లు పడగొట్టాడు.

కాగా, శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో భారత్‌ అధికారికంగా సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. గిల్‌ (92), కోహ్లి (88), శ్రేయస్‌ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్‌ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్‌ షమీ (5-1-18-5), మొహమ్మద్‌ సిరాజ్‌ (7-2-16-3), జస్ప్రీత్‌ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్‌ రజిత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement