
వన్డే ప్రపంచకప్ 2023లో ఇవాళ (అక్టోబర్ 31) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లకు సెమీస్ అవకాశాలు లేకపోవడంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఈ ఎడిషన్‌లో బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్ మినహా అన్ని జట్ల చేతుల్లో (ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇండియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్) ఓడగా.. పాకిస్తాన్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్, శ్రీలంకలపై మాత్రమే గెలిచి భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా చేతుల్లో వరుస మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఏడు, బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాయి.
పాక్‌కు మరో షాక్ తగిలేనా..?
పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాభవంతో పాటు నాలుగు వరుస పరాజయాలతో సెమీస్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకున్న పాక్.. బంగ్లాదేశ్‌పై గెలిచి ఊరట పొందాలని భావిస్తుంది. అయితే పాక్ ఇది అంత ఈజీ కాకపోవచ్చు. పాక్ కంటే బంగ్లాదేశ్ బలహీనమైన జట్టే అయినప్పటికీ.. గతంలో (1999 వరల్డ్‌కప్‌లో) పాక్‌కు షాకిచ్చిన అనుభవం బంగ్లా ఉండటంతో క్రికెట్ అభిమానులు మరో సంచలనాన్ని ఆశిస్తున్నారు.
ఓవరాల్‌గా పాక్‌దే పైచేయి..
ఓవరాల్‌గా చూస్తే వన్డేల్లో బంగ్లాదేశ్‌పై పాక్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 38 సందర్భాల్లో ఎదురెదురుపడగా.. పాక్ 33, బంగ్లాదేశ్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
Comments
Please login to add a commentAdd a comment