వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023 తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై జింబాబ్వే ఘన విజయం సాధించింది. హరారే వేదికగా ఇవాళ (జూన్ 18) జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బ్యాటర్లు సీన్ విలియమ్స్ (70 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్), క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ శతకాలతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. కుశాల్ భూర్టెల్ (99), ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మల్లా (41), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. జింబాబ్వే బౌలర్లలో నగరవా 4 వికెట్లు తీసి నేపాల్‌ను దారుణంగా దెబ్బకొట్టిగా.. మసకద్జ 2, చటారా, ముజరబాని తలో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఆటగాడు జాయ్‌లార్డ్ గుంబీ (25) వికెట్ సొంపాల్ కామీకి, వెస్లీ మధెవెరె (32) వికెట్ గుల్సన్ ఝాకు దక్కాయి.
ఈ విజయంతో జింబాబ్వే.. గ్రూప్-ఏలో మెరుగైన రన్‌రేట్‌తో (0.789) అగ్రస్థానానికి చేరుకుంది. గ్రూస్-ఏలో జింబాబ్వే, నేపాల్‌తో పాటు వెస్టిండీస్, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భాగంగానే ఇవాళ వెస్టిండీస్, యూఎస్‌ఏ జట్లు కూడా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విండీస్ విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది.
జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించగా.. బ్రాండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (2), రోవ్‌మన్ పావెల్ (0), కీమో పాల్ (4), అల్జరీ జోసఫ్ (3) విఫలమయ్యారు. యూఎస్‌ఏ బౌలర్లలో స్టీవెన్ టేలర్, సౌరభ్ నేత్రావాల్కర్, కైల్ ఫిలిప్ తలో 3 వికెట్లు, నోషటష్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఛేదనలో యూఎస్‌ఏ తడబడుతుంది. 44 ఓవర్ల తర్వాత ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి, ఓటమి దిశగా పయనిస్తుంది.
క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో భాగంగా రేపు (జూన్ 19) శ్రీలంక-యూఏఈ.. ఐర్లాండ్-ఒమన్ తలపడనున్నాయి. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, ఒమన్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment