Commonwealth Games 2022- న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భేటీ అయ్యారు. ప్రధాని అధికారిక నివాసంలో జరిగే ఈ కార్యక్రమంలో కొందరు మినహా దాదాపు విజేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మీ అపూర్వ విజయాలు చూసి జాతి మొత్తం గర్విస్తోందని ప్రశంసించారు.
స్వర్ణ యుగం మొదలైంది!
‘‘మీ షెడ్యూల్‌లో కొంత సమయాన్ని నాకు కేటాయించి నా నివాసానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరు భారతీయుల్లాగే.. మీ గురించి మాట్లాడటం నాకూ గర్వంగా ఉంది. భారత క్రీడల్లో స్వర్ణ యుగం ఆరంభమైంది. ఇది కేవలం యువ శక్తి వల్లే సాధ్యమైంది.
గడిచిన రెండు వారాల్లో అటు కామన్‌వెల్త్.. ఇటు చెస్ ఒలింపియాడ్ రూపంలో రెండు మెగా ఈవెంట్లు. కామన్‌వెల్త్ క్రీడల్లో చారిత్రాత్మక ప్రదర్శనతో పాటు చెస్ ఒలింపియాడ్‌కు మనం తొలిసారి ఆతిథ్యం ఇచ్చాము. ఈ మెగా ఈవెంట్‌లో విజయం సాధించిన వాళ్లందరికీ కూడా నా శుభాభినందనలు’’ అని ప్రధాని మోదీ విజేతలను కొనియాడారు.
ఇక కామన్‌వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తిన ఆయన.. స్వర్ణ పతక విజేత బాక్సర్ నీతూ ఘంఘస్, బ్మాడ్మింటన్ స్టార్, గోల్డ్ మెడలిస్ట్ పీవీ సింధు, క్రికెటర్ రేణుకా సింగ్‌తో పాటు రెజ్లర్ పూజా గెహ్లోత్ పేరును ప్రస్తావించారు.
భేటీలు భేష్!
అమ్మాయిలంతా శెభాష్ అనిపించుకున్నారని, దేశమంతా గర్వించేలా చేశారని కొనియాడారు. అయితే, పూజా కాంస్యానికే పరిమితమైనందుకు కన్నీరు పెట్టుకున్నపుడు తాను వెంటనే స్పందించానన్న ప్రధాని మోదీ.. పతకం సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు ఆనందించాలే తప్ప బాధపడవద్దంటూ క్రీడాకారులకు సూచించారు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో సీనియర్ అథ్లెట్లు ముందుండి నడిస్తే.. యువ ఆటగాళ్లు వారి స్ఫూర్తితో పతకాలు సాధించారని కొనియాడారు.
ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడినపుడు గర్వంతో గుండె ఉప్పొంగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా యూకేకు బయల్దేరే ముందు కూడా క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే. దేశాన్ని గర్వపడేలా చేస్తామని అప్పుడు తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఇక ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు (మొత్తం 61 పతకాలు) సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రెజ్లింగ్‌లోనే మనకు 6 స్వర్ణాలు సహా మొత్తం 12 పతకాలు వచ్చాయి.
చదవండి: Ind Vs Zim ODI Series: జింబాబ్వేకు పయనమైన టీమిండియా ఆటగాళ్లు..
The Great Khali: 'ది గ్రేట్ ఖలీ' కన్నీటి పర్యంతం.. అంతుచిక్కని ప్రశ్నలా!
Elated to interact with our CWG 2022 contingent. Entire nation is proud of their outstanding achievements. https://t.co/eraViqKcnl
— Narendra Modi (@narendramodi) August 13, 2022
Comments
Please login to add a commentAdd a comment