ధనుష్ శ్రీకాంత్
విశ్వ వేదికపై తెలుగు తేజం ధనుష్ శ్రీకాంత్ మరోసారి తన గురితో అదరగొట్టాడు. బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో ఈ తెలంగాణ యువ షూటర్ భారత్‌కు బంగారు బోణీ అందించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో 19 ఏళ్ల ధనుష్ శ్రీకాంత్ స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన శౌర్య సైనీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లోనే కాంస్య పతకం దక్కించుకున్నాడు. గత ఏడాది ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ టీమ్ విభాగంలో స్వర్ణం... 2019లో ఆసియా చాంపియన్‌షిప్‌లో టీమ్ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో స్వర్ణాలు గెలిచిన ధనుష్ శ్రీకాంత్ అదే జోరును డెఫిలింపిక్స్‌లోనూ కొనసాగించాడు.
కాక్సియస్ డు సుల్ (బ్రెజిల్): భారీ బృందంతో బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన భారత్ ఒకే రోజు మూడు పతకాలతో మెరిసింధి. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన షూటింగ్, బ్యాడ్మింటన్ ఈవెంట్స్‌లో భారత క్రీడాకారులు పతకాలు సంపాదించారు. షూటింగ్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ధనుష్ శ్రీకాంత్ స్వర్ణం... శౌర్య సైనీ కాంస్యం సాధించగా... బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్‌లో టీమిండియా బంగారు పతకం దక్కించుకుంది. జెర్లీన్, అభినవ్ శర్మ, ఆదిత్య యాదవ్, శ్రేయా సింగ్లా, రోహిత్ భాకెర్, హృతిక్ ఆనంద్‌లతో కూ డిన భారత్ ఫైనల్లో 3–1తో జపాన్‌ను ఓడించింది. ప్రస్తుతం భారత్ మూడు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది.
కొత్త ప్రపంచ రికార్డుతో...
ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ధనుష్ శ్రీకాంత్ 247.5 పాయింట్లు స్కోరు చేశాడు. బధిరుల విభాగం ఫైనల్లో ఇది కొత్త ప్రపంచ రికార్డు కావడం విశేషం. గతంలో ఈ రికార్డు కొలిన్ ముల్లర్ (జర్మనీ; 243.2 పాయింట్లు) పేరిట ఉండేది. ఎలిమినేషన్ పద్ధతిలో 24 షాట్‌లపాటు జరిగిన ఫైనల్లో కొరియా షూటర్ కిమ్ వూ రిమ్ 246.6 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... శౌర్య సైనీ 224.3 పాయింట్లు స్కోరు చేసి కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో ధనుష్ 623.3 పాయింట్లతో రెండో స్థానంలో, శౌర్య 622.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్‌లు లభించాయి.
గగన్ నారంగ్ శిక్షణలో...
భారత స్టార్ షూటర్, హైదరాబాద్‌కే చెందిన గగన్ నారంగ్‌కు చెందిన గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో ధనుష్ శ్రీకాంత్ ఐదేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాడు. బధిరుడైన శ్రీకాంత్‌కు గగన్ ప్రత్యేక పద్ధతిలో శిక్షణ ఇచ్చాడు. రైఫిల్‌ను ఎలా పట్టుకోవాలి... గురి ఎలా చూడాలి... షూట్ చేసేందుకు ఎలా నిలబడాలి... తదితర విషయాలను కాగితాలపై బొమ్మలు గీసి శ్రీకాంత్‌కు ఈ క్రీడలోని మెళకువలను నేర్పించాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లోనూ పతకాలు నెగ్గిన శ్రీకాంత్ ఆసియా జూనియర్ చాంపియన్ షిప్, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లోనూ భారత్‌కు పతకాలు అందించాడు. ఈ నెలలో అజర్‌బైజాన్‌లో జరిగే ప్రపంచకప్‌లో ధనుష్ శ్రీకాంత్ భారత సీనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించనున్నాడు.
చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ జట్టులోకి యువ ఆటగాడు.. ఎవరీ ట్రిస్టన్ స్టబ్స్..?
Comments
Please login to add a commentAdd a comment