CSA T20 Challenge: Dewald Brevis Smashes Record-Breaking 57-Ball 162 - Sakshi
Sakshi News home page

Dewald Brevis: జూనియర్‌ 'ఏబీడీ' విధ్వంసం.. 57 బంతుల్లో 162 పరుగులు

Published Tue, Nov 1 2022 7:15 AM | Last Updated on Tue, Nov 1 2022 9:09 AM

Dewald Brevis sends record books tumbling with phenomenal 162 in just 57 balls - Sakshi

దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్‌ బ్రెవిస్‌ టి20 క్రికెట్‌లో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. సీఎస్‌ఏ చాలెంజ్‌ లీగ్‌లో భాగంగా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రెవిస్‌  57 బంతుల్లోనే 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 162 పరుగులు సాధించాడు. 35 బంతుల్లోనే శతకం సాధించిన అతను ఐదో ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేయగా, 52 బంతుల్లో 150 పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు.

గేల్‌ (175), ఫించ్‌ (172) తర్వాత టి20 క్రికెట్‌లో ఇది మూడో అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. కాగా బ్రెవిస్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన టైటాన్స్‌.. బ్రెవిస్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది.

అతడితో పాటు మరో ఓపెనర్‌ పిళ్లై 52 పరుగులతో రాణించాడు. అనంతరం 272 పరుగుల భారీ లక్ష్యంతో  బరిలోకి దిగిన నైట్స్‌ 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులకే పరిమితమైంది. తద్వారా నైట్స్‌పై 41 పరుగుల తేడాతో టైటాన్స్‌ విజయం సాధించింది. ఇక నైట్స్‌ బ్యాటర్లలో గిహాన్ క్లోయెట్(51) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టైటాన్స్‌ బౌలర్లలో నైల్‌ బ్రాండ్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. ఆరోన్ ఫాంగిసో రెండు, బ్రెవిస్‌, హర్మర్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: బంగ్లాదేశ్‌లో పర్యటించే టీమిండియా ఇదే.. తెలుగు ఆటగాడికి అవకాశం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement