రాంచీ: కరోనా మహమ్మారి కారణంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత రెండేళ్లుగా ఎక్కువ శాతం రాంచీలోని తన ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యాడు. అక్కడే సేంద్రీయ వ్యవసాయం చేస్తూ కుటుంబంతో సరదాగా సమయం గడుపుతున్నాడు. ఇక ఐపీఎల్ 2021 వాయిదా పడడంతో దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తున్నాడు. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ టూర్ ముగించుకుని స్వస్థలానికి చేరుకున్న మాహీ.. రాంచీలోని తన స్నేహితులను కలిశాడు. వారితో కలిసి కార్ గ్యారేజ్‌లో భోజనం చేస్తూ సరదాగా టైంపాస్ చేశాడు. గ్యారేజ్‌లో ఉండే ఓ బల్లపై భోజనం పెట్టుకుని, స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ విందు ఆరగించాడు. వారి వెనక పాతకాలం నాటి రోల్స్ రాయిస్ కారు ఒకటుంది. దానిని ఓ వ్యక్తి రిపేర్ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెరిసిన గడ్డంతో ధోనీ నవ్వుతూ ఈ ఫొటోలో కనిపిస్తున్నాడు. సాధారణ వ్యక్తిలా ధోనీ భోజనం చేసిన విధానం అందరిని ఆకట్టుకుంటుంది. న్యూ లుక్‌లో ధోనీ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్ చరిత్రలో తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ధోనీ.. అలా సింపుల్‌గా ఉండటంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతని సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. స్టార్ క్రికెటర్ హోదాను పక్కకు పెట్టి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడాన్ని అభినంధిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ నెలలో యూఏఈలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment