నేడు, రేపు డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్
భారత్ నుంచి బరిలో నీరజ్, అవినాశ్ సాబ్లే
బ్రసెల్స్ (బెల్జియం): అథ్లెటిక్స్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఈవెంట్ అయిన డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో అగ్రశ్రేణి అథ్లెట్లంతా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఇటీవల పారిస్ ఒలింపిక్స్ పతకాలతో మెరిసిన ఆటగాళ్లంతా మళ్లీ తమ స్థాయిని ప్రదర్శించాలని పట్టుదలగా ఉన్నారు. పోటీ పడేందుకు ఈ ఏడాది మొత్తం 14 డైమండ్ లీగ్ సిరీస్‌లు అందుబాటులో ఉండగా... తాము ఎంచుకున్న సిరీస్‌లలో పాల్గొనడం ద్వారా సాధించిన పాయింట్లతో ఆటగాళ్లు ఫైనల్‌కు అర్హత సాధించారు.
ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు కలిపి మొత్తం 32 అంశాల్లో పతకాలు గెలిచేందుకు అవకాశం ఉంది. పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన అర్మాండ్ డుప్లాంటిస్ (స్వీడన్), అమెరికా స్ప్రింటర్ ష కారీ రిచర్డ్సన్, స్టార్ హర్డ్‌లర్ సిడ్నీ మెక్‌లాలిన్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఫెయిత్ కిపైగాన్ లాంటి టాప్ ప్లేయర్లు ఫైనల్లో బరిలోకి దిగుతున్నారు. లెట్సిల్ టె»ొగో (బోట్స్‌వానా), ర్యాన్ క్రూజర్, యరస్లొవా మహుచుక్ తదితరులు కూడా తుది సమరంలో పోటీ పడుతున్నారు.
ఓవరాల్‌గా 18 మంది ఒలింపిక్ విజేతలు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండటం విశేషం. 50 వేల సామర్థ్యం గల కింగ్ బౌదిన్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడ విజేతగా నిలిచిన వారికి డైమండ్ లీగ్ ట్రోఫీతో 30 వేల డాలర్ల ప్రైజ్‌మనీ, వచ్చే ఏడాది జపాన్‌లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభిస్తుంది. అగ్రశ్రేణి అథ్లెట్ల ఆటతో రెండు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు మరింత వినోదం ఖాయం.
నేడు సాబ్లే... రేపు నీరజ్
డైమండ్ లీగ్ ఫైనల్‌లో భారత్ నుంచి ఇద్దరు అథ్లెట్స్ పోటీ పడుతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో జాతీయ రికార్డు సాధించిన అవినాశ్ సాబ్లే ఈ పోటీల్లో బరిలో నిలిచాడు. నేటి రాత్రి 12.30 గంటలకు అతని ఈవెంట్ మొదలవుతుంది. ఈ ఏడాది పారిస్, సిలేసియాలలో జరిగిన సిరీస్‌లలో పాల్గొన్న సాబ్లే మొత్తం 3 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు. ఫైనల్లో 12 మంది మాత్రమే పోటీ పడే అవకాశం ఉంది.
అయితే తనకంటే మెరుగైన స్థానంలో నిలిచిన నలుగురు అథ్లెట్లు తప్పుకోవడంతో సాబ్లేకు చాన్స్ లభించింది. మరోవైపు భారత దిగ్గజ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించడంలో ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. దోహా, లుసాన్ సిరీస్‌లలో పాల్గొన్న అతను మొత్తం 14 పాయింట్లు సాధించి ఓవరాల్‌గా నాలుగో స్థానం సాధించాడు.
గత ఏడాది డైమండ్ లీగ్‌లో చోప్రా రన్నరప్‌గా నిలిచాడు. రేపు అర్ధరాత్రి 12 గంటల నుంచి నీరజ్ చోప్రా ఈవెంట్ జరుగుతుంది. జ్యూరిక్ (స్విట్జర్లాండ్)లో జరిగిన 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా విజేతగా... యూజీన్ (అమెరికా)లో జరిగిన 2023 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ రన్నరప్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment