నీరజ్‌ చోప్రా పైనే భారత్‌ ఆశలు | Paris Olympics athletics competitions from today | Sakshi
Sakshi News home page

నీరజ్‌ చోప్రా పైనే భారత్‌ ఆశలు

Published Thu, Aug 1 2024 4:03 AM | Last Updated on Thu, Aug 1 2024 8:37 AM

Paris Olympics athletics competitions from today

నేటి నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలు

బరిలో 29 మంది భారత అథ్లెట్లు 

తొలి రోజు 20 కిలోమీటర్ల రేస్‌ వాక్‌  

పారిస్‌: విశ్వ క్రీడల్లో అందరూ ఆసక్తితో ఎదురుచూసే అథ్లెటిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ పోటీలకు నేడు తెర లేవనుంది. ఒలింపిక్స్‌ మొదలై ఐదు రోజులు దాటినా.. అసలు సిసలు మజా ఇచ్చే అథ్లెటిక్స్‌ ఈవెంట్‌ నేటి నుంచి జరుగుతుంది. భారత అభిమానుల విషయానికొస్తే స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపైనే అందరి దృష్టి ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన నీరజ్‌ మరోసారి అదే స్థాయి ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతుండగా.. భారత్‌ నుంచి మొత్తం 29 మంది అథ్లెట్లు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. 

‘టోక్యో’ క్రీడల్లో పసిడి పతకం సాధించిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అదే నిలకడ కొనసాగిస్తూ వస్తున్న నీరజ్‌ వరుసగా రెండో స్వర్ణం నెగ్గాలని తహతహలాడుతున్నాడు. ఆగస్టు 6న పురుషుల జావెలిన్‌త్రో క్వాలిఫికేషన్‌ రౌండ్‌... రెండు రోజుల తర్వాత 8న ఫైనల్‌ జరగనుంది. నీరజ్‌ టైటిల్‌ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్‌ త్రోయర్‌ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్‌ లామింగ్‌ (స్వీడన్‌; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్‌; 1920, 1924), జాన్‌ జెలెన్జీ (చెక్‌ రిపబ్లిక్‌; 1992, 1996, 2000), ఆండ్రీస్‌ థోర్‌కిల్డ్‌సెన్‌ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు.  

రేస్‌ వాక్‌తో మొదలు.. 
అథ్లెటిక్స్‌లో భాగంగా తొలి రోజు మహిళల, పురుషుల 20 కిలోమీటర్ల రేస్‌ వాక్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. భారత్‌ నుంచి పురుషుల విభాగంలో అ„Š దీప్‌ సింగ్, వికాస్‌ సింగ్, పరమ్‌జీత్‌ సింగ్‌ బిష్త్‌ పోటీలో ఉన్నారు. ఇక మహిళల విభాగం నుంచి ప్రియాంక గోస్వామి బరిలోకి దిగనుంది. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్‌ సాబ్లేపై భారీ అంచనాలు ఉండగా... 4–400 మీటర్ల పురుషుల ఈవెంట్‌లో మన జట్టు పతక ఆశలు రేపుతోంది. ఇటీవల పారిస్‌ డైమండ్‌ లీగ్‌లో అవినాశ్‌ జాతీయ రికార్డు బద్దలు కొట్టి 8 నిమిషాల 9.91 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆరో స్థానంలో నిలిచాడు.  

హర్డిల్స్‌లో జ్యోతి...రిలేలో జ్యోతిక శ్రీ 
ఇక ఒలింపిక్స్‌ చరిత్రలో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొంటున్న తొలి భారత అథ్లెట్‌గా ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ గుర్తింపు పొందనుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న జ్యోతి... ‘పారిస్‌’ క్రీడల్లోనూ అదే జోరు కనబర్చాలని చూస్తోంది. 

మహిళల 4్ఠ400 మీటర్ల రిలే జట్టులో కీలక సభ్యురాలైన ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి దండి జ్యోతిక శ్రీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌తో పాటు 5000 మీటర్ల పరుగులో పాల్గొంటున్న పారుల్‌ చౌదరి, మహిళల జావెలిన్‌త్రోలో అన్ను రాణి, పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్‌ పాల్‌సింగ్‌ తూర్, ట్రిపుల్‌ జంప్‌లో ప్రవీణ్‌ చిత్రావేల్, అబూబాకర్‌ నుంచి కూడా మెరుగైన ప్రదర్శన ఆశించవచ్చు. 

కొత్తగా రెపిచాజ్‌ రౌండ్‌.. 
రెజ్లింగ్, రోయింగ్‌ మాదిరిగానే ఈసారి నుంచి ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లోనూ రెపిచాజ్‌ విభాగాన్ని ప్రవేశ పెట్టనున్నారు. 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల పరుగు వరకు వ్యక్తిగత విభాగాల్లో దీన్ని అమలు చేయనున్నారు. హర్డిల్స్‌కు కూడా ఇది వర్తించనుంది. గతంలో హీట్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన అథ్లెట్లతో పాటు వేగవంతమైన టైమింగ్‌ నమోదు చేసుకున్న అథ్లెట్లు సెమీఫైనల్‌కు చేరేవారు. తాజా రెపిచాజ్‌ రౌండ్‌తో హీట్స్‌లో ముందు నిలిచిన వారు మాత్రమే సెమీస్‌కు అర్హత సాధిస్తారు. మిగిలిన వాళ్లందరూ రెపిచాజ్‌ రౌండ్‌లో పాల్గొంటారు. అందులో సత్తా చాటితే సెమీఫైనల్‌కు చేరేందుకు రెండో అవకాశం దక్కనుంది.  

అసలేంటీ రెపిచాజ్‌
ఫ్రెంచ్‌ భాషలో రెపిచాజ్‌.. అంటే రెండో అవకాశం అని అర్థం. నిజంగానే ఇది అథ్లెట్లకు సెకండ్‌ చాన్స్‌ వంటిదే. ‘పారిస్‌’ క్రీడల ద్వారా అథ్లెటిక్స్‌లో ఈ రౌండ్‌ను మొదటిసారి ప్రవేశ పెట్టనున్నారు. గతంలో మార్షల్‌ ఆర్ట్స్, రోయింగ్, రెజ్లింగ్‌ క్రీడల్లో మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఇప్పుడు రన్నింగ్, హర్డిల్స్‌లో 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల వరకు దీన్ని అమలు చేయనున్నారు. దీంతో తొలి హీట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయిన వారికి సెమీఫైనల్‌ చేరడానికి మరో అవకాశం దక్కనుంది.

3000 మీటర్ల స్టీపుల్‌చేజ్, 5000 మీటర్ల పరుగులో రెపిచాజ్‌ రౌండ్‌ను అనుమతించడం లేదు. ఈ ఈవెంట్‌లలో పాల్గొన్న అథ్లెట్లు తేరుకునేందుకు మరింత సమయం అవసరమవనుండటంతో.. 1500 మీటర్ల వరకే దీన్ని పరిమితం చేశారు. ఇక పురుషుల, మహిళల 10,000 మీటర్లు, మారథాన్స్‌లో కేవలం ఫైనల్‌ మాత్రమే నిర్వహించనున్నారు. 

మహిళల 4 X400 మీటర్ల రిలే దండి జ్యోతిక శ్రీ
తొలి రౌండ్‌: ఆగస్టు 9 
మధ్యాహ్నం గం 2:10 నుంచి 
ఫైనల్‌: ఆగస్టు 11 
అర్ధరాత్రి గం. 12.44 నుంచి  

మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌  జ్యోతి యర్రాజీ
తొలి రౌండ్‌: ఆగస్టు 7 
మధ్యాహ్నం గం. 1:45 నుంచి 
రెపిచాజ్‌ రౌండ్‌: ఆగస్టు 8 
మధ్యాహ్నం గం. 2:05 నుంచి 
సెమీఫైనల్‌: ఆగస్టు 9 
మధ్యాహ్నం గం. 3:35 నుంచి 
ఫైనల్‌: రాత్రి గం. 11:05 నుంచి

జావెలిన్‌ త్రో షెడ్యూల్‌ 
నీరజ్‌ చోప్రా,కిషోర్‌ జేనా 
క్వాలిఫయింగ్‌: ఆగస్టు 6 మధ్యాహ్నం గం. 1:50 నుంచి 
ఫైనల్‌: ఆగస్టు 8 రాత్రి 
గం. 11:55 నుంచి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement