DY Patil Tournament: Dinesh Karthik smashed 75 runs from just 38 balls - Sakshi
Sakshi News home page

Dinesh Karthik: ఐపీఎల్‌ మూడ్‌లోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం

Published Tue, Feb 21 2023 3:15 PM | Last Updated on Tue, Feb 21 2023 3:30 PM

Dinesh Karthik Smashed 75 Runs From 38 Balls In DY Patil Tournament - Sakshi

టీమిండియా వెటరన్‌ వికెట్‌కీపర్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు హార్డ్‌ హిట్టర్‌ దినేశ్‌ కార్తీక్‌.. ఐపీఎల్‌-2023 సీజన్‌ ప్రారంభానికి నెల రోజుల ముందే ఆ మూడ్‌లోకి వచ్చాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం ఉంటున్న డీకే.. డీవై పాటిల్‌ టీ20 కప్‌-2023 సూపర్‌ లీగ్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

ఆర్బీఐతో జరిగిన మ్యాచ్‌లో డీవై పాటిల్‌ గ్రూప్‌-బి జట్టు తరఫున బరిలోకి దిగిన డీకే.. 38 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 75 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహించిన జట్టు 25 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన డీకే.. పూనకం వచ్చినట్లు ఊగిపోయి, ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. ఐపీఎల్‌ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ టోర్నీ.. డీకే తదితర ఐపీఎల్‌ క్రికెటర్లకు బాగా ఉపయోగపడనుంది.

ఇక మ్యాచ్‌ వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన డీవై పాటిల్‌ గ్రూప్‌-బి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించగా.. ఛేదనలో ఆర్బీఐ టీమ్‌ కోటా ఓవర్లు మొత్తం ఆడి 7 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమై 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డీవై పాటిల్‌ ఇన్నింగ్స్‌లో దినేశ్‌ కార్తీక్‌ (75 నాటౌట్‌) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. హార్ధిక్‌ తామోర్‌ (28), యశ్‌ ధుల్‌ (29), శశాంక్‌ సింగ్‌ (23) ఓ మోస్తరుగా రాణించారు. ఆర్బీఐ బౌలర్లలో అలీ ముర్తుజా 2, షాబాజ్‌ నదీమ్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, సాయన్‌ మొండల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్బీఐ.. బల్తేజ్‌ సింగ్‌ (3/33), వినీత్‌ సిన్హా (3/34), సాగర్‌ ఉదేశీ (1/24) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్బీఐ ఇన్నింగ్స్‌లో సుమిత్‌ (49), జ్యోత్‌ (35), రాజేశ్‌ బిష్ణోయ్‌ (33) ఓ మోస్తరుగా రాణించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.  కాగా, దినేశ్‌ కార్తీక్‌ ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement