పదమూడు కాదు.. పదిహేను!.. రూ. 1.10 కోట్లు.. మాకేం భయం లేదు! | Dont Fear: IPL History Youngest Buy Vaibhav Father On Age Fraud Allegations | Sakshi
Sakshi News home page

రూ. 1.10 కోట్లు.. మా కష్టం ఎవరికీ తెలియదు.. పొలం కూడా అమ్మేశా!.. ఏ భయమూ లేదు

Published Tue, Nov 26 2024 12:53 PM | Last Updated on Tue, Nov 26 2024 1:15 PM

Dont Fear: IPL History Youngest Buy Vaibhav Father On Age Fraud Allegations

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్‌) వేలం చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అమ్ముడుపోయిన క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు వైభవ్‌ సూర్యవంశీ. క్రికెట్‌ వర్గాల్లో ఇప్పుడు అతడి పేరే హాట్‌ టాపిక్‌. అయితే, కొంతమంది వైభవ్‌ నైపుణ్యాలను ప్రశంసిస్తుండగా.. మరికొంత మంది మాత్రం వయసు విషయంలో అతడు అందరినీ మోసం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

బిహార్‌ మొత్తానికి ముద్దుబిడ్డ
వైభవ్‌ సూర్యవంశీ పదమూడేళ్ల పిల్లాడు కాదని.. అతడి వయసు పదిహేనేళ్లు అంటూ వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ స్పందించారు. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నా కుమారుడు చిన్ననాటి నుంచే ఎంతో కఠిన శ్రమకోరుస్తున్నాడు. ఇప్పుడు అతడు సాధించిన విజయం వల్ల బిహార్‌ మొత్తానికి ముద్దుబిడ్డ అయిపోయాడు.

ఎనిమిదేళ్ల వయసులోనే అతడు అండర్‌-16 డిస్ట్రిక్ట్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. క్రికెట్‌ కోచింగ్‌ కోసం నేను తనని రోజూ సమస్తిపూర్‌ వరకు తీసుకువెళ్లి.. తిరిగి తీసుకువచ్చేవాడిని. వైభవ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు మేమెంతగా కష్టపడ్డామో ఎవరికీ తెలియదు.

మాకు ఏ భయమూ లేదు
ఆర్థిక ఇబ్బందుల వల్ల పొలం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. నా కుమారుడు ఎనిమిదిన్నరేళ్ల వయసులోనే మొట్టమొదటిసారి బీసీసీఐ బోన్‌ టెస్టు ఎదుర్కొన్నాడు. ఇప్పటికే అతడు ఇండియా అండర్‌-19 జట్టుకు ఆడుతున్నాడు. మాకు ఏ భయమూ లేదు. కావాలంటే మరోసారి వైభవ్‌ ఏజ్‌ టెస్టుకు వెళ్తాడు’’ అని ఆరోపణలు చేస్తున్న వారికి సంజీవ్‌ సూర్యవంశీ గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

కాగా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. వైభవ్‌ సూర్యవంశీ వయసు 13 ఏళ్ల 243 రోజులు. ఇక రూ. 30 లక్షల కనీస ధరతో అతడు తన పేరును ఐపీఎల్‌-2025 మెగా వేలంలో నమోదు చేసుకున్నాడు. ఆక్షన్‌లో వైభవ్‌ కోసం రాజస్తాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ పోటీపడగా.. రాజస్తాన్‌ ఏకంగా రూ. కోటీ పది లక్షల భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది.

ఒకే ఓవర్లో  17 పరుగులు 
ఈ విషయం గురించి సంజీవ్‌ సూర్యవంశీ స్పందిస్తూ.. ‘‘నాగపూర్‌లో ట్రయల్స్‌ సమయంలో వైభవ్‌ను రమ్మని రాజస్తాన్‌ రాయల్స్‌ నుంచి పిలుపు వచ్చింది. బ్యాటింగ్‌ కోచ్‌ విక్రం రాథోడ్‌ సర్‌ నా కుమారుడిని టెస్టు చేశారు. ఒకే ఓవర్లో అతడు 17 పరుగులు చేశాడు. ట్రయల్స్‌లో మొత్తంగా ఎనిమిది సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు’’ అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. 

చదవండి: Gautam Gambhir: ఆసీస్‌తో రెండో టెస్ట్‌కు ముం​దు స్వదేశానికి పయనమైన టీమిండియా హెడ్‌ కోచ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement