దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా నార్త్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో సౌత్ జోన్ పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 580 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (72 బంతుల్లో 77; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి హాఫ్ సెంచరీతో అలరించగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు.
అంతకుముందు స్పిన్నర్ రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు (7/70) నమోదు చేయడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులకే చాపచుట్టేసింది. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో నిశాంత్ సింధు (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత జోన్.. రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (255 బంతుల్లో 134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్‌కీపర్ రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 630 పరుగుల వద్ద (8 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది.
పృథ్వీ షా మెరుపు శతకం.. ఓటమి దిశగా సెంట్రల్ జోన్
కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు పట్టుబిగించింది. పృథ్వీ షా మెరుపు శతకంతో మెరవడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 371 పరుగుల వద్ద ముగించి, ప్రత్యర్ధి ముందు 500 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. మరో రెండు రోజు ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ గెలవాలంటే మరో 468 పరుగులు చేయాలి ఉంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులు చేసి ఆలౌటైంది. పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (67) అర్ధశతకాలతో రాణించారు. కుమార్ కార్తీకేయ (5/66) వెస్ట్ జోన్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. అనంతరం వెస్ట్ జోన్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కరణ్ శర్మ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉనద్కత్, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment