‘ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. అతడి రీఎంట్రీ ఆపలేరు’ | East Zone Captain Ishan Kishan Praise Mohammed Shami-Comeback | Sakshi
Sakshi News home page

‘ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. అతడి రీఎంట్రీ ఆపలేరు’

Sep 5 2026 4:57 PM | Updated on Sep 5 2026 5:11 PM

East Zone Captain Ishan Kishan Praise Mohammed Shami-Comeback

Photo Credit: BCCI Twitter

టీమిండియా సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ జాతీయ జట్టులో చోటు కోల్పోయినప్పటికీ దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో 13 ఏళ్ల తర్వాత ఈస్ట్‌జోన్ ఫైనల్‌కు చేరడంలో షమీ కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో షమీ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆదివారం నుంచి ఈస్ట్‌జోన్‌, సౌత్‌జోన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

ఈ నేపథ్యంలో ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఆటగాడు బాగా రాణిస్తున్నాడంటే ఎంపికకు అతడి వయసుతో సంబంధముండదని తెలిపాడు. షమీ విషయంలోనూ అదే వర్తిస్తుందని, జట్టులో చోటు కోల్పోయినప్పటి నుంచి షమీ కసితో ఉన్నాడని, అతడిని టీమిండియాకు ఎంపిక చేయాల్సిన సమయం వచ్చిందని ఇషాన్ అభిప్రాయపడ్డాడు.


Photo Credit: BCCI Twitter

ఇషాన్ మాట్లాడుతూ.. ‘‘అత్యుత్తమ ఆటగాళ్లలో షమీ ఒకడని నేను భావిస్తున్నాను. స్టార్‌గా వెలుగొందుతున్న షమీ బెంగాల్ తరఫున ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ కీలక బౌలర్‌గా మారిపోయాడు. ఒక బౌలర్‌గా టీమిండియాకు కూడా ఎంతో సేవ చేశాడు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని నేను భావిస్తాను. కష్టపడుతున్న సమయంలో వయసును లెక్కలోకి తీసుకోకూడనేది నా అభిప్రాయం. 

షమీ భాయ్‌లో ఆ కసి నాకు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎలా ఆడాడు అనేదాన్ని పక్కనబెట్టి ఇప్పుడెలా ఆడుతున్నాడనే దానిపై బీసీసీఐ సెలెక్టర్లు దృష్టి సారించాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఈస్ట్‌జోన్ జట్టుకు షమీ ఆడుతుండడం మా అదృష్టం. అతడు మా జట్టులో  ఉండడం మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. 36 ఏళ్ల వయసులో ఎక్కువ ఓవర్లు వేస్తే అలసిపోయే బౌలర్లతో పోలిస్తే షమీ వేరుగా కనిపిస్తాడు. 


Photo Credit: BCCI Twitter

నేను అడగకముందే జట్టుకు వికెట్ అవసరమైనప్పుడల్లా తాను బౌలింగ్ చేస్తానంటూ షమీ భాయ్ ముందుకు వచ్చేవాడు. ఒక కెప్టెన్‌గా అతడి కసిని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. టీమిండియాలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే అతడి తాపత్రయం నా కళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆకలిగొన్న సింహంలా  కనిపిస్తున్నాడు. షమీ భాయ్‌ రీఎంట్రీని ఎవరూ ఆపలేరు.’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. 

ఇక సౌత్‌జోన్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా షమీపై ప్రసంశల జల్లు కురిపించాడు. షమీ లాంటి చాకచక్యమైన పేసర్‌ను ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని తిలక్ వర్మ పేర్కొన్నాడు. షమీ భాయ్‌తో ఆడడం మాకు ఎప్పుడూ ఇష్టమే అని తిలక్ వెల్లడించాడు. ఇటీవలే షమీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 900 వికెట్ల మార్క్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్‌లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.

Read: నాలుగేళ్ల తర్వాత బరిలో విలియమ్స్‌ సిస్టర్స్‌.. ఫలితం ఏంటంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement