Asia T20 Cup: సెమీస్‌లో పాక్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. ఫైనల్లో ఎంట్రీ | Emerging Asia Cup 2024: Sri Lanka A Beat Pakistan A Enters Final | Sakshi
Sakshi News home page

Asia T20 Cup: చెలరేగిన బ్యాటర్లు.. సెమీస్‌లో లంక చేతిలో పాక్‌ చిత్తు

Oct 25 2024 5:48 PM | Updated on Oct 25 2024 6:05 PM

Emerging Asia Cup 2024: Sri Lanka A Beat Pakistan A Enters Final

PC: ACC X

వర్దమాన టీ20 క్రికెట్‌ జట్ల ఆసియా కప్‌-2024లో ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా శ్రీలంక నిలిచింది. తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. అల్‌ అమెరత్‌ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక-‘ఎ’ జట్టు పాకిస్తాన్‌-‘ఎ’తో తలపడింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ యాసిర్‌ ఖాన్‌ రెండు పరుగులకే పెవిలియన్‌ చేరగా.. మరో ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఒమైర్‌ యూసఫ్‌ అర్ధ శతకంతో చెలరేగాడు. మొత్తంగా 46 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 68 పరుగులు చేశాడు.

దుషాన్‌ హేమంత తిప్పేశాడు
అయితే, యూసఫ్‌నకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. లంక బౌలర్లను ఎదుర్కోలేక వచ్చినవాళ్లు వచ్చినట్లుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కెప్టెన్ మహ్మద్‌ హ్యారిస్‌(6) పూర్తిగా విఫలం కాగా.. తర్వాతి స్థానాల్లో వచ్చిన కాసిం అక్రం(0), హైదర్‌ అలీ(14), అరాఫత్‌ మిన్హాస్‌(10), అబ్దుల్‌ సమద్‌(0), అబ్బాస్‌ ఆఫ్రిది(9), మహ్మద్‌ ఇమ్రాన్‌(13), సూఫియాన్‌ ముఖీం(4 నాటౌట్‌), షానవాజ్‌ దహానీ(0- నాటౌట్‌) చేతులెత్తేశారు.

ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్‌ దుషాన్‌ హేమంత అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా.. పేసర్లు నిపుణ్‌ రన్సిక, ఇషాన్‌ మలింగ రెండేసి వికెట్లు కూల్చారు.

అహాన్‌ విక్రమసింఘే సూపర్‌ హాఫ్‌ సెంచరీ
ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్‌ యశోద లంక (11- అబ్‌స్ట్రకింగ్‌ ది ఫీల్డ్‌) తక్కువ స్కోరుకే వెనుదిరగాల్సి వచ్చినా.. మరో ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లాహిరు ఉదర 20 బంతుల్లో 43 పరుగులతో ఆకట్టుకున్నాడు.

ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ అహాన్‌ విక్రమసింఘే సూపర్‌ హాఫ్‌ సెంచరీతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. 46 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 52 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో కెప్టెన్‌ నువానిడు ఫెర్నాండో(9) విఫలం కాగా.. సహాన్‌ అరాచ్చిగె(16 బంతుల్లో 17)ఫోర్‌ బాది లంకను విజయతీరాలకు చేర్చాడు.

ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌లో
ఈ క్రమంలో 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక రెండో సెమీ ఫైనల్లో తిలక్‌ వర్మ సారథ్యంలోని భారత-‘ఎ’ జట్టు అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టుతో శ్రీలంక టైటిల్‌ కోసం ఆదివారం(అక్టోబరు 27) తలపడుతుంది.

చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్‌?.. మాజీ హెడ్‌కోచ్‌ ఘాటు విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement