
లబుషేన్ (PC: CA)
ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన అతడు.. ప్రపంచంలో ఇంతవరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. కాగా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు ఆసీస్ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది.
హెడ్ విధ్వంసకర శతకం.. లబుషేన్ అజేయ హాఫ్ సెంచరీ
ఇందులో భాగంగా మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న కంగారూ టీమ్.. గురువారం నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (129 బంతుల్లో 154 నాటౌట్) విధ్వంసకర శతకంతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా ఐదో నంబర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ సైతం రాణించాడు. 61 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 77 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చడంలో హెడ్‌కు సహకరించాడు.
మూడు వికెట్లు తీసిన లబుషేన్
ఇక అంతకు ముందు.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా మూడు వికెట్లతో చెలరేగగా.. రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల లబుషేన్ సైతం మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ రెండు, డ్వార్షుయిస్, మాథ్యూ షార్ట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
నాలుగు క్యాచ్‌లతో మెరిసిన లబుషేన్
ఇక ఈ మ్యాచ్‌లో బెన్ డకెట్ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు), కెప్టెన్ హ్యారీ బ్రూక్(31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రూపంలో కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన లబుషేన్.. జోఫ్రా ఆర్చర్(4) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. డకెట్, బ్రూక్, జాకబ్ బెతెల్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆదిల్ రషీద్(0) క్యాచ్‌లు కూడా తానే అందుకున్నాడు.
𝐃𝐮𝐜𝐤𝐞𝐭𝐭 𝐦𝐮𝐬𝐭 𝐛𝐞 𝐠𝐮𝐭𝐭𝐞𝐝 😤
Catching practice for Labuschagne off his own bowling 😎
Watch #ENGvAUS LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/p0IxZKhQZY— Sony LIV (@SonyLIV) September 19, 2024
వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
అలా మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు నాలుగు క్యాచ్‌లు అందుకుని.. లక్ష్య ఛేదనలో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు లబుషేన్. తద్వారా ఈ కుడిచేతి వాటం ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఒక వన్డే మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటు.. మూడు వికెట్లు తీసి.. మూడు కంటే ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇదీ 30 ఏళ్ల లబుషేన్ సాధించిన అత్యంత అరుదైన ఘనత!!.. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే లీడ్స్ వేదికగా శనివారం జరుగనుంది.
చదవండి: IND vs BAN: బుమ్రా సూపర్ బాల్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో