యాసెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. మూడోరోజు ఆటలో రెండు సెషన్లు దాదాపు వర్షంతో తుడిచిపెట్టుకుపోయినప్పటికి.. ఇంగ్లండ్ పైచేయి సాధించింది. కేవలం ఆఖరి సెషన్‌లోనే మిగతా ఆరు వికెట్లు కూల్చిన ఇంగ్లండ్.. ఆసీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ముందు 251 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడంతో ఇంగ్లండ్ గెలుస్తుందా.. లేక ఆసీస్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా అనేది చూడాలి.
కాగా లార్డ్స్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు సహా సిబ్బందికి ఏదో ఒక రకంగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ అభిమానుల దృష్టిలో అలెక్స్ కేరీ విలన్‌గా మారిపోయాడు. ఇక ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు కూడా లీడ్స్‌లోని హెడ్డింగ్లే స్టేడియంలో చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టు ప్రారంభానికి ముందు స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
ఎంట్రీ పాస్ లేదని ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను స్టేడియం లోపలికి అనుమతించలేదని సమాచారం. ఇంగ్లండ్ మీడియాలో దీని గురించి కథనాలు వెలువడ్డాయి. ఆ కథనాల ప్రకారం.. సరైన ఎంట్రీ పాస్ లేకపోవడంతో మెక్‌కల్లమ్‌ను భద్రతా సిబ్బంది గేటు వద్ద ఆపేశారు. డ్యూటీలో ఉన్న సెక్యురిటీ గార్డ్ మెక్‌కల్లమ్‌ను గుర్తుపట్టలేదు. అంతేకాకుండా అతడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో సెక్యురిటీ గార్డ్ తన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మెక్‌కల్లమ్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని భద్రతా సిబ్బందిని హెచ్చరించి అక్కడి నుంచి ముందుకుసాగాడు.
ఇక మెక్‌కల్లమ్ న్యూజిలాండ్ తరపున 101 టెస్టులు, 260 వన్డేలు, 71 టి20 మ్యాచ్‌లు ఆడి.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 14,676 పరుగులు సాధించాడు. విధ్వంసకర బ్యాటర్‌గా పేరు పొందిన మెక్‌కల్లమ్ ఖాతాలో 19 సెంచరీలు, 76 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం
Comments
Please login to add a commentAdd a comment