తృణముల్‌ చాప్టర్‌ ముగిసింది: మాజీ క్రికెటర్‌ | Ex Cricketer Alleges Demand 5 Crore MLA Ticket -TMC-Chapter Over | Sakshi
Sakshi News home page

తృణముల్‌ చాప్టర్‌ ముగిసింది: మాజీ క్రికెటర్‌

May 5 2026 7:34 PM | Updated on May 5 2026 7:48 PM

Ex Cricketer Alleges Demand 5 Crore MLA Ticket -TMC-Chapter Over

తృణ‌ముల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే, టీమిండియా మాజీ క్రికెట‌ర్ మ‌నోజ్ తివారి తృణ‌ముల్ పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. మ‌మతా బెన‌ర్జీ నేతృత్వంలోని టీఎంసీ త‌న‌కు హౌరాలోని షిబ్‌పుర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌డానికి రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన‌ట్లు ఆరోపించాడు. ఇక రాజ‌కీయంగా తృణ‌ముల్ కాంగ్రెస్‌తో త‌న‌ అధ్యాయం ముగిసింద‌ని మ‌నోజ్ తివారి పేర్కొన్నాడు. 

సోమ‌వారం వెలువ‌డిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 15 ఏళ్ల మ‌మ‌తా బెన‌ర్జీ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడిన‌ బెంగాల్ ప్ర‌జ‌లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో బెంగాల్‌లో బీజేపీ గెలుపుపై మ‌నోజ్ తివారి స్పందించాడు. ఈ సంద‌ర్భంగా తృణ‌ముల్ అవినీతి, పార్టీ చేసిన అరాచ‌కాల‌ను మ‌నోజ్ తివారి ఎండ‌గ‌ట్టాడు.  

‘హౌరాలోని శిబ్‌పూర్ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వడానికి టీఎంసీ నిరాకరించింది. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ సారి ఎన్నికల్లో సుమారు 70 నుంచి 72 మంది అభ్యర్థులు భారీగా డబ్బు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. అందుకే పార్టీ ఘోర పరాజయం పాలైంది. అవినీతిమయమైన పార్టీకి పతనం తప్పదు. టీఎంసీతో నా అధ్యాయం ముగిసింది. 

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో నేను క్రీడల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాను. పేరుకే మంత్రి పదవి.. కానీ నాకు ఎటువంటి అధికారాలు ఉండేవి కాదు. కనీసం నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వ‌లేదు. నా సొంత నియోజకవర్గంలో డ్రైనేజీ, మురుగునీటి సమస్యల కోసం ఎంతో పోరాడాను.

ప్రతి ఏడాది ఏదో ఒక మాస్టర్ ప్లాన్ అంటారు. కానీ అది మాటలకే పరిమితం అయ్యేది. క్రీడా మంత్రి బిస్వాస్‌కు క్రీడలపై క‌నీస‌ అవగాహన లేదు. నా ఎదుగుదలను చూసి అసూయ పడేవారు. క్రీడా కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించకుండా అడ్డుకునేవారు. నాపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు. నేను ఐపీఎల్‌లో 10 ఏళ్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20 ఏళ్లు ఆడాను. నాకు డబ్బు అవసరం లేదు’ అని తివారీ స్పష్టం చేశారు.

ఇక త‌న రాజ‌కీయ జీవితం ముగిసింద‌ని ప్ర‌క‌టించిన మ‌నోజ్ తివారి త్వ‌ర‌లో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు. అయితే ఈసారి ఆట‌గాడిగా కాకుండా కోచ్ పాత్ర‌లో వ‌స్తున్న‌ట్లు తెలిపాడు. ఇప్ప‌టికే బీసీసీఐ లెవెల్ 2 కోచ్ ప‌రీక్ష‌ను కూడా పాసైన‌ట్లు తెలిపాడు. ఇప్ప‌టికే బెంగాల్ క్రికెట్ హెడ్ కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు పేర్కొన్నాడు. 

బెంగాల్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన మ‌నోజ్ తివారి దేశ‌వాలీ క్రికెట్‌లో బెంగాల్ త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు (10,195 ప‌రుగులు) చేసిన క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఇక టీమిండియా త‌ర‌ఫున 2008 నుంచి 2015 మ‌ధ్య ఆడిన మనోజ్‌ తివారి 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో మనోజ్‌ తివారి కేకేఆర్‌, పంజాబ్‌, రైజింగ్‌ పూణే, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ప్రాతినిధ్యం వహించాడు. 

చదవండి: చిచ్చు రగిలింది.. చిక్కుల్లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement