ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. పుష్కరకాలం తర్వాత మళ్లీ మెగా టోర్నీకి మన దేశం ఆతిథ్యం ఇస్తుండడంతో ప్రాధాన్యత నెలకొంది. ఇప్పటికే మ్యాచ్‌లు నిర్వహించనున్న స్టేడియాలకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను బీసీసీఐ ఐసీసీకి పంపించింది. రెండు మూడు రోజుల్లో ఐసీసీ ఆమోదముద్ర వేయడంతో పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
ఇక అందరూ ఊహించినట్లుగానే వరల్డ్‌కప్ ఆరంభమ్యాచ్, ఫైనల్ మ్యాచ్ సహా మరికొన్ని కీలక మ్యాచ్‌లకు(భారత్-పాక్) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. లక్ష మంది సామర్థ్యం, ఆధునిక టెక్నాలజీ.. అత్యాధునిక సౌకర్యాలు.. మంచి డ్రైనేజీ వ్యవస్థ.. ఇది మోదీ స్టేడియం గురించి బయటికి వినపడే విషయాలు.
కానీ అసలు మ్యాటర్ ఏంటంటే.. అహ్మదాబాద్ స్టేడియం అనుకున్నంత రేంజ్‌లో లేదన్నది అభిమానుల వాదన. ఇది నిజమే అని ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023 ఫైనల్ సందర్భంగా నిరూపితమైంది. సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ భారీ వర్షం కారణంగా రిజర్వ్‌డేకు వాయిదా పడింది. రిజర్వ్ డే రోజున కూడా వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది.
అయితే మే 28న కురిసిన భారీ వర్షానికి అహ్మదాబాద్ స్టేడియంలో ఒక పెవిలియన్ ఎండ్‌లో పైకప్పుకు సొట్ట పడడంతో స్టాండ్స్ మొత్తం నీటితో నిండిపోయింది. దీనివల్ల తర్వాతి రోజు మ్యాచ్‌కు వచ్చిన ప్రేక్షకులకు కూర్చోవడానికి ఇబ్బంది తలెత్తింది. అంతేకాదు స్టేడియం ఔట్‌ఫీల్డ్‌తో పాటు పిచ్ కూడా పూర్తిగా బురదమయం అయింది. పిచ్‌ను తయారు చేయడానికి సాపర్స్, ఇసుకను ఉపయోగించారు. దీనితో పాటు హెయిర్ డ్రైయ్యర్లు, ఇస్త్రీ పెట్టెలు ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఇది నిజం కాదని తేలింది. కానీ ఒక్క భారీ వర్షం వల్ల నరేంద్ర మోదీ స్టేడియంలోని లోపాలన్ని బయటపడ్డాయి.
ఇవన్నీ పక్కనబెడితే.. కొత్త స్టేడియం కావడంతో అది ప్రారంభమయినప్పటి నుంచి టీమిండియా ఆడిన ఏ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు అయినా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తూనే వస్తోంది. ఇది కొంతమంది అభిమానులకు నచ్చడం లేదు. బీజేపీ హయాంలో ఈ స్టేడియం నిర్మాణం పూర్తవ్వడంతో స్టేడియం పేరును సర్దార్ పటేల్ నుంచి నరేంద్ర మోదీకి మార్చి పొలిటికల్ యాంగిల్‌కు తెర తీశారు. అంతేకాదు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా అహ్మదాబాద్‌కు చెందినవాడు కావడం.. అతని తండ్రి దేశ రాజకీయాల్లో నెంబర్-2గా.. మోదీకి అత్యంత సన్నిహితుడిగా చక్రం తిప్పుతుండడంతో అహ్మదాబాద్ స్టేడియానికి కలిసి వస్తోందని చెప్పొచ్చు.
People who are asking for closed roof stadiums have a look at the pillars and roofs of the biggest stadium and the richest cricket board leaking. pic.twitter.com/idKjMeYWYd
— Manya (@CSKian716) May 28, 2023
అభిమానులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే.. ఎందుకు అహ్మదాబాద్ స్టేడియానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. వాస్తవానికి దేశంలో అతిపెద్ద స్టేడియాల్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కూడా ఉంది. అందులో ఫైనల్ నిర్వహిస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే బీసీసీఐ అయినప్పటికి.. మొత్తం జై షా కనుసన్నుల్లోనే జరుగుతున్నట్లు అర్థమవుతుంది.
ఇక మన భాగ్యనగరంలోని ఉప్పల్ స్టేడియం అత్యాధునిక డ్రైనేజీ సౌకర్యం కలిగిన స్టేడియాల్లో ఒకటిగా ఉంది. ఈ వరల్డ్‌కప్‌కు ఉప్పల్ ఆతిథ్యమిస్తున్నప్పటికి టీమిండియా ఆడే ఒక్క మ్యాచ్ కూడా ఈ లిస్ట్‌లో లేదని తెలిసింది. కనీసం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ అయినా మన భాగ్యనగరంలో నిర్వహించి ఉంటే బాగుండేదని అభిమానులు బాధపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment