దుబాయ్: ఆర్సీబీతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో దుమ్ములేపిన ఢిల్లీ.. ఆపై బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకుని విజయకేతనం ఎగురవేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడా నాలుగు వికెట్లు సాధించగా, అక్షర్ పటేల్, నోర్త్‌జేలు తలో రెండు వికెట్లు తీశారు. అశ్విన్‌కు వికెట్ లభించింది. మ్యాచ్ ఆద్యంతం కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో ఆర్సీబీ పరుగులు చేయడానికి కష్టమైంది. ఆర్సీబీ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి(43; 39 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఢిల్లీ నిర్దేశించిన 197 పరుగుల టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది.(చదవండి: ధోనిలో ఉన్న గ్రేట్‌నెస్ అదే!)
అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ యువ ఓపెనర్ పృథ్వీషాను ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా ఆటపట్టించాడు. టాస్ సమయంలో పృథ్వీ షా, రవిచంద్రన్ అశ్విన్‌తో సరదాగా మాట్లాడిన విరాట్.. ఈ సందర్భంగా పృథ్వీషా వద్దకు వస్తూనే అతని పొట్టను గిల్లుతూ టీజ్ చేశాడు. ఇదంతా టీవీ కెమెరాల్లో రికార్డువ్వడంతో పాటు మ్యాచ్ ప్రారంభానికి ముందు వచ్చే మ్యాచ్ ప్రజెంటేషన్ షోలో ప్రసారమైంది. ఇది చూసిన అభిమానులు స్క్రీన్ షాట్స్‌ను వైరల్ చేస్తున్నారు. సరదా కామెంట్స్‌తో ఆడేసుకుంటున్నారు. ఏందీ ఈ పొట్ట పృథ్వీ షా .. అని విరాట్ భాయ్ అడుగుతున్నారని ఒకరంటే, పొట్టలో రోహిత్ శర్మతో పోటీపడుతున్నావా? అని విరాట్ ప్రశ్నించాడని మరొకరు కామెంట్ చేశారు.
ఇలా అయితే ఎక్కువ రోజులు క్రికెట్ ఆడలేవని, కొంచెం తగ్గించు అని విరాట్ సలహా ఇచ్చాడని సెటైర్స్ వేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా క్రికెటర్లంతా కొంత బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్ అనంతరం కూడా పృథ్వీ షాతో విరాట్ చాలా సేపు ముచ్చటించాడు. సరదాగా జోకులు వేస్తూ నవ్వుకున్నారు. ఈ సీజన్‌లో పృథ్వీ షా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌లు మినహా మూడు ఇన్నింగ్స్‌ల్లో పృథ్వీ మెరిశాడు. పృథ్వీ షా వరుసగా (5, 64, 2, 66, 42) నమోదు చేసిన స్కోర్లు ఇవి.
Comments
Please login to add a commentAdd a comment