
లుసానే (స్విట్జర్లాండ్): భారత హాకీ ప్లేయర్లు హార్దిక్ సింగ్, సవిత పూనియాలు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) వార్షిక అవార్డులను గెలుచుకున్నారు. భారత మహిళల కెపె్టన్ అయిన సవిత ‘ఎఫ్‌ఐహెచ్ గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుతో హ్యాట్రిక్ కొట్టింది. సవిత 2021, 2022లలో కూడా ఈ అవార్డును అందుకుంది. ఆ్రస్టేలియా పర్యటనలో టెస్టు మ్యాచ్‌లు, హాంగ్జౌ ఆసియా క్రీడల్లో 33 ఏళ్ల సవిత చక్కని ప్రదర్శన కనబరిచింది.
అక్టోబర్‌లో సొంతగడ్డపై జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలుపడంలో కీలకపాత్ర పోషించింది. జనవరిలో రాంచీలో జరిగే ఎఫ్‌ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్‌లో జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యంగా సవిత జట్టును నడిపించనుంది.
భారత పురుషుల జట్టులో స్టార్ మిడ్‌ఫీల్డర్‌గా ఎదిగిన హార్దిక్ సింగ్ పోరాటపటిమను ఎఫ్‌ఐహెచ్ గుర్తించింది. అతను ‘ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది అతనికి లభించిన రెండో అవార్డు ఇది! హాకీ ఇండియా (హెచ్‌ఐ) నుంచి ‘బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ కూడా అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment