సిడ్నీ: భారత్‌తో ప్రతిష్టాత్మక సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించాలని పట్టుదలగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు కొత్త సమస్య వచ్చి పడింది. తొలి టెస్టు మ్యాచ్‌కు వేదికైన అడిలైడ్‌లో సోమవారం ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది. దాంతో టెస్టు కెప్టెన్ టిమ్ పైన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఆదివారం వరకు 4 కేసులు ఉన్న అడిలైడ్‌లో సోమవారం 17 కేసులు నమోదయ్యాయి.
దాంతో ఈ నగరం ఉండే సౌత్ ఆస్ట్రేలియాతో మంగళవారం అర్ధరాత్రి నుంచి తమ సరిహద్దులు మూసివేస్తున్నట్లు పక్క రాష్ట్రాలు వెస్ట్రన్ ఆస్ట్రేలియా, నార్తర్న్ టెరిటరీ, టాస్మేనియా, క్వీన్స్‌లాండ్ ప్రకటించాయి. అక్కడి నుంచి ఎవరైనా వచ్చినా కచ్చితంగా 14 రోజుల హోటల్ క్వారంటైన్‌కు వెళ్లేలా ఆదేశాలు జారీ చేశాయి. అయితే డిసెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టెస్టు (డే–నైట్)కు ఎలాంటి ఆటంకం ఉండబోదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ప్రకటించింది. అప్పటిలోగా పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
తొలి టెస్టుకు స్టేడియంలో సగం మంది ప్రేక్షకులను అనుమతించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే పరిస్థితి మారకపోతే మాత్రం ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరగవచ్చు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక విమానాల ద్వారా ఆస్ట్రేలియా జాతీయ జట్టు, దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ ఆటగాళ్లందరినీ ఒక్క చోటకు చేర్చాలని సీఏ భావిస్తోంది. కరోనా సమస్య లేని సిడ్నీకి (న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రం) అందరినీ తీసుకెళితే అన్ని మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు అవకాశం ఉంటుందనేది సీఏ ఆలోచన. ప్రస్తుతం భారత జట్టు సిడ్నీలోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment