చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో ఆడే భారత తుదిజట్టులో వాషింగ్టన్ సుందర్‌కు తప్పక స్థానం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను లోయర్ ఆర్డర్‌లో కాకుండా.. టాప్-5లో బ్యాటింగ్‌కు పంపించాలని అశూ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20 నుంచి తమ వేట మొదలుపెట్టనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్ ఆడుతుంది.
ఆ నలుగురు
ఆ తర్వాత న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. ఇక టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో స్పిన్ విభాగంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు, ఒక స్పెషలిస్టు బౌలర్‌కు చోటు దక్కింది. ఆ నాలుగు ఎవరంటే.. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్.. కుల్దీప్ యాదవ్.
వీరిలో కుల్దీప్ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా ఎడమచేతి వాటం బౌలర్లే. అయితే, ఇందులో రైటార్మ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే. అందునా అతడు ఆఫ్ స్పిన్నర్. ఈ ప్రత్యేకతే అతడికి చాంపియన్స్ ట్రోఫీ తుదిజట్టులో చోటు దక్కేలా చేస్తుందని స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
అంతేకాదు.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు వాషీ అంటే ఎంతో ఇష్టమని.. అది కూడా అతడికి ప్లస్ పాయింట్‌గా మారుతుందని అశూ పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో రైట్- లెఫ్ట్ కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది.
గంభీర్‌కు అతడంటే చాలా ఇష్టం.
కానీ మనకు ఎక్కువ మంది ఆఫ్ స్పిన్నర్లు లేరు. లెఫ్టార్మ్ స్పిన్నర్లే ఎక్కువ ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో వాషింగ్టన్ సుందర్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు రెండు కారణాలున్నాయి.. నాకు తెలిసినంత వరకు గంభీర్‌కు అతడంటే చాలా ఇష్టం.
అతడి ఆటతీరును దగ్గరగా గమనించడంతో పాటు.. కచ్చితంగా అండగా నిలబడతాడు. ఇక వాషీ ఆఫ్ స్పిన్నర్ కావడం కూడా కలిసి వస్తుంది. అయితే, అతడు ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తే మాత్రం జట్టు సమతూకంగా ఉండకపోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్‌లో అతడిని ముందుకు పంపాలి.
టాప్ 5లో ఉంటే
సమర్థవంతంగా బౌలింగ్ చేయడంతో పాటు నాలుగు లేదంటే ఐదో స్థానంలో ఆడే ఆల్‌రౌండర్ ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగకరం. అదీ ఆఫ్ స్పిన్నర్ టాప్ 5లో ఉంటే ఇంకా బాగుంటుంది’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా అశ్విన్ మాదిరే వాషీ కూడా తమిళనాడుకు చెందినవాడే. ఈ ఇద్దరూ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడిన భారత జట్టులో అశూ- వాషీ ఇద్దరికీ చోటు దక్కింది. అయితే, పెర్త్ టెస్టులో అనుభవజ్ఞుడైన అశూను కాదని.. మేనేజ్‌మెంట్ వాషీని ఆడించింది. అందుకు తగ్గట్లుగానే అతడు రాణించాడు కూడా!
అశూ ఆకస్మిక రిటైర్‌మెంట్
అయితే, ఆ తర్వాత మరో రెండు టెస్టుల్లోనూ అశూకు అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో బ్రిస్బేన్‌లో మూడో టెస్టు డ్రా అయిన తర్వాత అతడు సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మేనేజ్‌మెంట్ తీరు నచ్చకే అశూ రిటైర్మెంట్ ప్రకటించాడనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గంభీర్‌కు వాషీ ఆట అంటే ఇష్టమంటూ అశూ చేసిన వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయి.
కాగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వాషింగ్టన్ సుందర్.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టెస్టులు, 22 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 468, 315, 161 పరుగులు చేయడంతో పాటు.. 25, 23, 47 వికెట్లు తీశాడు.
చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’
Comments
Please login to add a commentAdd a comment