న్యూఢిల్లీ: ఐపీఎల్-2020 సీజన్ ప్రారంభంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట పడుతూ లేస్తూ సాగింది. కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌లలో గెలుపు ఖాయం అనుకున్న స్థితిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. కచ్చితంగా చివరి మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌లపై ఘన విజయాలు సాధించి ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఒకానొక దశలో టోర్నీ రేసు నుంచి తప్పుకునేలా కనిపించిన సన్‌రైజర్స్ .. పుంజుకుందంటే జాసన్ హోల్డర్ కూడా ఓ కారణం. ఆతడి చేరిక జట్టులో సమతూకం తీసుకువచ్చింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో జాసన్ హోల్డర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 4 ఓవర్లలో 25 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన హోల్డర్.. బ్యాటింగ్‌లో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఛేజింగ్‌లో తీవ్ర ఒత్తిడిలో హోల్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. (గెలిపిస్తే బాగుండేది..కానీ పవర్ గేమ్ అదిరింది!)
ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన జాసన్ హోల్డర్ 14 వికెట్లు తీయడంతో పాటు 66 రన్స్ చేశాడు. అయితే గత ఏడాది జరిగిన ఐపీఎల్ 2020 వేలంలో హోల్డర్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వెస్టిండీస్ కెప్టెన్‌గా ఉన్నహోల్డర్‌ను వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం పట్ల టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జేమ్స్ నీశమ్, క్రిస్ మోరీస్, మొయిన్ అలీ లాంటి ఆల్‌రౌండర్లను తీసుకున్న ఫ్రాంచైజీలు హోల్డర్‌ను పక్కనబెట్టడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు.
గౌతమ్ గంభీర్ ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘ వేలంలో జేమ్స్ నీషమ్, క్రిస్ మోరిస్, మొయిన్ అలీలను తీసుకున్నారు. కానీ జాసన్ హోల్డర్‌ను వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంతర్జాతీయ జట్టుకు హోల్డర్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతడు రెగ్యులర్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. కొత్త బంతితో బాగా రాణిస్తాడు. పరుగులు చేస్తాడు. ఓవర్సీస్ ఆల్‌రౌండర్ నుంచి ఇంతకు మంచి ఏం ఆశించగలం. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాళ్లకు ఒత్తిడిని ఎదుర్కోవడం తెలుస్తుంది' అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment