photo credit: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మే 1న జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి-ఎల్‌ఎస్‌జీ మెంటార్ గౌతమ్ గంభీర్‌ల మధ్య జరిగిన ఘర్షనపై క్రికెట్ దిగ్గజం, భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. కోహ్లి-గంభీర్‌లు జరిమానాలు విధిస్తే మారే రకం కాదని, వారిని తక్షణమే ఐపీఎల్ నుంచి సస్పెండ్ చేయాలని నిర్వహకులకు సూచించాడు.
కోహ్లి-గంభీర్‌ల ఓవరాక్షన్ మరీ ఎక్కువైందని, ఇష్టం లేకపోతే స్వచ్ఛందంగా తప్పుకోవాలి కానీ, భారత క్రికెట్ పరువును ఇలా బజారుకీడ్చకూడదని హెచ్చరించాడు. జరిమానాలు విధించి సరిపెట్టుకుంటే వారి ఓవరాక్షన్ ఆగదని, కఠినమైన శిక్షలు వేస్తే ఏమైనా మారే అవకాశం ఉంటుందని అన్నాడు. కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకునే కోహ్లి, గంభీర్‌లు ఫైన్‌లు అస్సలు లెక్క చేయరని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవని వారి నుంచి కచ్చితమైన హామీ లభిస్తేనే లీగ్‌లో కొనసాగించాలని, అలా చేయకపోతే వారిని లీగ్ నుంచి బహిష్కరించాలని కోరాడు.
రూల్స్ వ్యతిరేకించి, దేశ పరువును బజారుకీడ్చిన వారు ఎంతటి స్టార్ క్రికెటర్లైనా సహించకూడదని, కఠిన చర్చలు తీసుకుంటేనే మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. తాము క్రికెట్ ఆడే రోజుల్లో కూడా స్వల్ప స్థాయిలో కవ్వింపులు ఉండేవని, మరీ ఇలా బాహాబాహీకి దిగిన దాఖలాలు చాలా అరుదు అని తెలిపాడు.
కాగా, లక్నో-ఆర్సీబీ మ్యాచ్‌లో నవీన్ ఉల్ హాక్-కోహ్లిల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం చినిచినికి గాలివానలా మారి క్రికెట్ సర్కిల్స్‌లో ప్రకంపనలకు కారణమైంది. నవీన్‌తో కోహ్లి గొడవపడటాన్ని పర్సనల్‌గా తీసుకున్న గంభీర్ మ్యాచ్ అనంతరం నానా హంగామా చేశాడు. కోహ్లి కూడా ఏ మాత్రం తగ్గలేదు. వీరిద్దరి గొడవకు దిగిన సమయంలో లక్నో మైదానం రణరంగాన్ని తలపించింది. బాహాటంగా గొడవకు దిగి, రూల్స్‌ను తుంగలో తొక్కినందుకు గాను బీసీసీఐ కోహ్లి, గంభీర్‌లకు 100 శాతం (ఒక మ్యాచ్‌కు) మ్యాచ్ ఫీజ్‌లో కోత విధించింది.
Comments
Please login to add a commentAdd a comment