Shubman Gill, Ishan Kishan Ireland T20Is Absence Leaves Ex-India Cricketer Fuming - Sakshi
Sakshi News home page

టీమిండియా టీ20లను సీరియస్‌గా తీసుకోవడం లేదు.. వాళ్లిద్దరికి రెస్ట్‌ అవసరమా?: మాజీ క్రికెటర్‌ ఘాటు వ్యాఖ్యలు

Published Mon, Aug 14 2023 1:47 PM | Last Updated on Mon, Aug 14 2023 2:10 PM

Gill Ishan Kishan Ireland T20Is Absence Leaves Ex India Cricketer Fuming - Sakshi

India tour of West Indies, 2023: ‘‘మన వాళ్లు అంతర్జాతీయ టీ20లను సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌ ఐర్లాండ్‌కు వెళ్లడం లేదన్నది వాస్తవం. ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమే. కానీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు మనం 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 

ఐపీఎల్‌లో ఆడితే.. వరల్డ్‌కప్‌ గెలిచినట్లా?
ఐపీఎల్‌ గురించి మనకు అనవసరం. లీగ్‌ క్రికెట్‌లో మన ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచినంత మాత్రాన వరల్డ్‌కప్‌ గెలిచినట్లు కాదు కదా! మనం ఇంతవరకు కేవలం ఒక్కసారి మాత్రమే పొట్టి ఫార్మాట్‌లో జగజ్జేతగా నిలిచాం. అది కూడా ఐపీఎల్‌ లేనప్పుడు మాత్రమే!’’ అని టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. 

ఐపీఎల్‌ ప్రదర్శనల ఆధారంగా మేజర్‌ ఈవెంట్లకు ఆటగాళ్లను ఎంపిక చేసే పరిస్థితి లేదన్నాడు. యువ ఆటగాళ్లను కూడా విశ్రాంతి పేరిట పక్కన పెట్టడం సరికాదని పేర్కొన్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైశ్వాల్‌లను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.

సమయం ఉంది కదా! రెస్ట్‌ ఎందుకు?
కాగా వెస్టిండీస్‌ టూర్‌లో 3-2తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా తదుపరి ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఆగష్టు 18- 23 వరకు మూడు టీ20లు ఆడనుంది. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సారథ్యంలోని యువ జట్టు అక్కడికి వెళ్లనుంది.

ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. ‘‘వీలైనన్ని ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం మనకు ముఖ్యం. ఐర్లాండ్‌ వంటి జట్టుతో మూడు టీ20లు ఆడుతున్నారంటే.. ఇషాన్‌ కిషన్‌ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టడం ఎందుకు? విండీస్‌తో మూడో టీ20 నుంచే అతడికి రెస్ట్‌ ఇచ్చారు.

నాకైతే అర్థం కావడం లేదు
ఐర్లాండ్‌కు కూడా పంపడం లేదు. ఒకవేళ శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ ఆసియా వన్డే కప్‌ ఆరంభం నాటికి తిరిగి వస్తే ఇషాన్‌ పరిస్థితి ఏంటి? ఐర్లాండ్‌ సిరీస్‌ ఆగష్టులోనే ముగుస్తుంది. ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా సెప్టెంబరులో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

ఒకవేళ అతడిని బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా భావించినా.. ఆసియా కప్‌ నాటికి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. ఫిట్‌గా ఉన్న యువ ఆటగాళ్లను కూడా విశ్రాంతి పేరిట పక్కన పెట్టడం ఎందుకో అర్థం కావడం లేదు’’ అని విస్మయం వ్యక్తం చేశాడు.

వెస్టిండీస్‌తో టీమిండియా నాలుగో టీ20 ముగిసిన తర్వాత ఈ మేరకు ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో హార్దిక్‌ సేనపై ఘన విజయం సాధించిన కరేబియన్‌ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. అంతకు ముందు టీమిండియా 1-0తో టెస్టు, 2-1తో వన్డే సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే.

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్‌ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్‌, జితేశ్‌ శర్మ, శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్, షహబాజ్‌ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిధ్‌ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్, ముకేశ్‌ కుమార్, ఆవేశ్‌ ఖాన్‌.  

చదవండి: Ind Vs WI: టీమిండియాను అవమానించిన విండీస్‌ హిట్టర్‌! నోర్ముయ్‌.. 
ఇంత చెత్త కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్‌?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement