గంభీర్‌తో అగార్కర్ (PC: BCCI)
టీమిండియా భవిష్య కెప్టెన్ ఎవరన్న అంశంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టతనిచ్చాడు. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా చూసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
అయితే, ఏ విషయంలోనూ గ్యారెంటీ ఇవ్వలేమని.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం గిల్‌కే తమ ఓటు అని అగార్కర్ పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు.
కెప్టెన్‌గా అలరించిన గిల్
కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ జట్టు స్వదేశానికి తిరిగి రాగా.. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.
తొలిసారిగా కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించిన గిల్.. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియాను 4-1తో విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో శ్రీలంక పర్యటన నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా గిల్ పేరును ప్రకటించింది బీసీసీఐ.
సీనియర్లను కాదని
వన్డేల్లో రోహిత్ శర్మ సారథిగా కొనసాగనుండగా.. టీ20 రెగ్యులర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. వీళ్లిద్దరికి డిప్యూటీగా శుబ్‌మన్ గిల్‌కు అవకాశం ఇచ్చింది.
అయితే, కెప్టెన్సీ రేసులో ఉన్న సీనియర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలను కాదని బీసీసీఐ గిల్‌ను వైస్ కెప్టెన్ చేయడం విశేషం.
ఈ విషయంపై సోమవారం నాటి మీడియా సమావేశంలో ప్రస్తావనకు రాగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘రిషభ్ చాలా కాలంగా ఆటకు దూరమయ్యాడు. వికెట్ కీపర్‌గా అతడి సేవలు మాకు చాలా అవసరం.
అందుకే పంత్‌కు నో ఛాన్స్
దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత జట్టులో పునరాగమనం చేసిన ఆటగాడిపై భారం మోపాలని మేము భావించడం లేదు. ఇక కేఎల్ రాహుల్ చాలా కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగానే ఉన్నాడు.
ఆటగాళ్ల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాతే కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు మేము సిద్ధమయ్యాం. టీ20 కెప్టెన్ విషయంలో గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం.
రోహిత్ లేనపుడు హార్దిక్ పాండ్యా గాయపడితే పరిస్థితి గందరగోళంగా ఉండేది. అయితే, అదృష్టవశాత్తూ వరల్డ్‌కప్ నాటికి రోహిత్ తిరిగి రావడం మంచిదైంది. కానీ మరోసారి రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేము.
రిస్క్ చేయలేం
శుబ్‌మన్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడు. ఏడాది కాలంగా అద్బుతంగా ఆడుతున్నాడు. సూర్య, రోహిత్ ఉన్నపుడే అతడిని నాయకుడిగా నైపుణ్యాలు మెరుగుపరచుకునేలా గిల్‌కు శిక్షణ ఇవ్వాల్సి ఉంది.
అకస్మాత్తుగా కొత్త కెప్టెన్‌ను ట్రై చేయాలంటే రిస్కే. అందుకే ఇప్పటి నుంచే అతడిని భవిష్య కెప్టెన్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. కెప్టెన్‌గా తను అనుభవం గడిస్తే మాకు తలనొప్పులు తగ్గుతాయి.
ఇప్పుడే కాదు
అయితే, ఇందుకు చాలా సమయం ఉంది. ఇప్పుడే ఏదీ కచ్చితంగా చెప్పలేము. రెండేళ్లపాటు అతడిని గమనిస్తూనే ఉంటాం’’ అని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు.
కాగా జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంకతో సిరీస్ మొదలుపెట్టనుండగా.. హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ నేపథ్యంలో గౌతీతో కలిసి సోమవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫన్స్‌లో అగార్కర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment