టీమిండియాకు శుభవార్త.. స్టార్‌ పేసర్‌ వచ్చేస్తున్నాడు! | Good News: Shami Resumes Bowling, Likely To Make Return In Ind Vs Ban Tests | Sakshi
Sakshi News home page

టీమిండియా స్టార్‌ పేసర్‌ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్‌ నాటికి!

Published Sat, Jun 22 2024 10:26 AM | Last Updated on Sat, Jun 22 2024 10:46 AM

Good News: Shami Resumes Bowling, Likely To Make Return In Ind Vs Ban Tests

దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న భారత క్రికెటర్‌ మహ్మద్‌ షమీ.. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఈ పేస్ బౌలర్‌ పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్న షమీ.. ట్రెయినింగ్‌ సెషన్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎన్సీఏ స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ మెడిసిన్‌ హెడ్‌ డాక్టర్‌ నితిన్‌ పటేల్‌, కండిషనింగ్‌ కోచ్‌ రజినీకాంత్‌ ఆధ్వర్యంలో పురోగోతి సాధిస్తున్నాడు.

అతడు బౌలింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు
వీలైనంత త్వరగా టీమిండియా రీఎంట్రీ ఇచ్చేందుకు శాయశక్తులా ​కృషి చేస్తున్నాడు. ఈ విషయం గురించి షమీ చిన్ననాటి కోచ్‌ బద్రుద్దీన్‌ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ‘‘అతడు బౌలింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు.

పూర్తిస్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు కానీ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బాల్‌ రిలీజ్‌ చేయగలుగుతున్నాడు. ఏదేమైనా తను ఈ మాత్రం కోలుకోవడం శుభసూచకం’’ అని న్యూస్‌18తో పేర్కొన్నాడు.

కాగా రైటార్మ్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

వికెట్ల వీరుడిగా
వన్డే వరల్డ్‌కప్‌-2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన షమీ.. చీలమండ గాయంతో గతేడాది నవంబరు నుంచి జట్టుకు దూరమయ్యాడు. 

ఈ క్రమంలో పలు ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఐపీఎల్‌-2024, టీ20 ప్రపంచకప్‌-2024 కూడా ఆడలేకపోయాడు. ఇక గాయానికి సర్జరీ చేయించుకుని కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఇలా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు ఈ ఉత్తరప్రదేశ్‌ బౌలర్‌.  

టీమిండియా షెడ్యూల్‌ ఇదే 
ఈ ఏడాది భారత పురుషుల క్రికెట్‌ జట్టు స్వదేశంలో 5 టెస్టులు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరులో భారత్‌లో బంగ్లాదేశ్‌ జట్టు పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత్‌తో బంగ్లాదేశ్‌ 2 టెస్టులు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది.

అక్టోబర్‌ 12న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. 

విదేశీ టూర్ల వివరాలు
న్యూజిలాండ్‌తో సిరీస్‌ ముగిశాక భారత జట్టు  ఆస్ట్రేలియాలో పర్యటించి ఐదు టెస్టులు ఆడుతుంది. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాక భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడుతుంది.

ఇక ఈ ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆడుతుంది. 

నవంబర్‌ 8న డర్బన్‌లో జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత పోర్ట్‌ ఎలిజబెత్‌లో 10న రెండో టి20, 13న సెంచూరియన్‌లో మూడో టి20, 15న జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే చివరిదైన నాలుగో టీ20తో పర్యటన ముగుస్తుంది. కాగా టీమిండియా ప్రస్తుతం ప్రపంచకప్‌-2024తో బిజీగా ఉంది.  సెమీస్‌ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

బంగ్లాదేశ్‌తో 
తొలి టెస్టు: సెప్టెంబరు 19–23 (చెన్నై) 
రెండో టెస్టు: సెప్టెంబరు  27–అక్టోబర్‌ 1 (కాన్పూర్‌) 
తొలి టి20: అక్టోబర్‌ 6 (ధర్మశాల) 
రెండో టి20: అక్టోబర్‌ 9 (న్యూఢిల్లీ) 
మూడో టి20: అక్టోబర్‌ 12 (హైదరాబాద్‌) 

న్యూజిలాండ్‌తో 
తొలి టెస్టు: అక్టోబర్‌ 16–20 (బెంగళూరు) 
రెండో టెస్టు: అక్టోబర్‌ 24–28 (పుణే) 
మూడో టెస్టు: నవంబర్‌ 1–5 (ముంబై) 

ఇంగ్లండ్‌తో  
తొలి టి20: జనవరి 22 (చెన్నై) 
రెండో టి20: జనవరి 25 (కోల్‌కతా) 
మూడో టి20: జనవరి 28 (రాజ్‌కోట్‌) 
నాలుగో టి20: జనవరి 31 (పుణే) 
ఐదో టి20: ఫిబ్రవరి 2 (ముంబై) 
తొలి వన్డే: ఫిబ్రవరి 6 (నాగ్‌పూర్‌) 
రెండో వన్డే: ఫిబ్రవరి 9 (కటక్‌) 
మూడో వన్డే: ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్‌).

చదవండి: షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement