రోహిత్ శర్మ (PC: BCCI)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. రోహిత్ చెప్పినట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు భారత క్రికెట్ పట్ల కాస్తైనా విశ్వసనీయత ప్రదర్శించాలన్నాడు.
కాగా టెస్టు జట్టులోకి తిరిగి రావాలంటే భారత ఆటగాళ్లు కచ్చితంగా రంజీల్లో ఆడాలని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు రంజీ క్రికెట్ ఆడటం పట్ల విముఖంగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు బోర్డు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రశ్న ఎదురైంది. బదలుగా.. ‘‘టెస్టు క్రికెట్ ఆడాలన్న తపన, కసి ఉన్నవారికి మాత్రమే జట్టులో చోటు ఇస్తాం’’ అని రోహిత్ శర్మ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాల్సిన ఆవశ్యకతను నొక్కి వక్కాణించాడు.
ఈ విషయంపై స్పందించిన సునిల్ గావస్కర్.. ‘‘రోహిత్ చెప్పిన మాటలు సరైనవే. టెస్టు క్రికెట్‌పై ఇష్టం ఉన్న వాళ్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలి. ఎన్నో ఏళ్లుగా నేను ఇదే విషయం చెబుతున్నా.
దేశవాళీ క్రికెట్‌లో రాణించడం వల్లే చాలా మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కనీసం వాళ్లైనా డొమెస్టిక్ క్రికెట్ పట్ల విశ్వాసం ప్రదర్శించాలి కదా’’ అంటూ రంజీల్లో ఆడేందుకు ఇష్టపడని టీమిండియా క్రికెటర్లకు చురకలు అంటించాడు.
ఒకవేళ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు ఎవరైనా టెస్టులు ఆడొద్దని నిర్ణయించుకుంటే.. వారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టేయాలంటూ పరక్షంగా బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది.
సీనియర్ల గైర్హాజరీలో దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్ ఈ సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. రజత్ మినహా మిగతా ముగ్గురు సత్తా చాటి తమ ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment