
యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో అఫ్గానిస్తాన్ శుభారంభం చేసింది. షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో 72 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మునుల్లా గుర్బాజ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో గుర్బాజ్ కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. అతడితో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ హాప్ సెంచరీతో మెరిశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో జద్రాన్ 59 పరుగులు చేశాడు. యూఏఈ బౌలర్లలో సిద్దూఖీ, ఆయాన్ ఖాన్, జవదుల్లా తలా వికెట్ సాధించారు.
అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమైంది. యూఏఈ వికెట్ కీపర్ బ్యాటర్ అర్వింద్(70) పరుగులతో టప్ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫరూఖీ రెండు వికెట్లు, నవీన్ ఉల్ హాక్, క్వైస్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 షార్జా వేదికగా డిసెంబర్ 31న జరగనుంది.
చదవండి: Ranji Trophy 2024: రంజీ ట్రోఫీకి జట్టు ప్రకటన.. మహ్మద్ షమీ తమ్ముడు ఎంట్రీ?