దంబుల్లా వేదికగా శ్రీలంక-అఫ్గానిస్తాన్‌ను మధ్య జరిగిన మూడో టీ20 సస్పెన్స్ సినిమా థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 3 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ నుంచి 1-2 తేడాతో అఫ్గాన్ వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. కాగా 210 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక సరిగ్గా 19 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.
ఈ క్రమంలో ఆఖరి ఓవర్‌లో లంక విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. అఫ్గాన్ కెప్టెన్ జద్రాన్ చివరి ఓవర్ వేసే బాధ్యతను వాఫ్‌దర్ మముండ్‌కు ఇచ్చాడు. అయితే వాఫ్‌దర్ వేసిన తొలి బంతినే కుమిండు మెండిస్ బౌండరీగా మలిచాడు. ఈ క్రమంలో ఐదు బంతుల్లో 15గా శ్రీలంక విజయసమీకరణం మారింది. రెండో బంతికి ఎటువంటి పరుగు రాకపోగా.. మూడో బంతిని మెండీస్ ఫోర్ బాదాడు.
అయితే నాలుగో బంతిని బౌలర్ బీమర్‌గా సంధించాడు. దీంతో బ్యాటర్ హైట్ నోబాల్ కోసం అంపైర్‌ను ప్రశ్నించాడు. అంపైర్ మాత్రం ఫెయిర్ డెలివరీగానే ప్రకటించాడు. కానీ రిప్లేలో మాత్రం అది క్లియర్‌గా హైట్ నోబాల్‌గా కన్పించింది. దీంతో నాలుగో బంతికి కూడా ఎటువంటి పరుగు రాలేదు. ఐదో బంతికి మెండిస్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని బ్యాక్‌వర్డ్ స్వ్కేర్ దిశగా వెళ్లింది.
కానీ మెండిస్ సింగిల్ తీసుకోలేదు. ఆఖరి బంతికి 9 పరుగులు అవసరమవ్వగా మెండిస్ సిక్స్ కొట్టినప్పటికి ఫలితం లేదు. దీంతో 3 పరుగుల తేడాతో లంక ఓటమి పాలైంది. లంక బ్యాటర్లలో మెండిస్(65), నిస్సాంక(60) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగినప్పటికి విజయం మాత్రం అఫ్గాన్‌నే వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అఫ్గాన్ ఓపెనర్ గుర్భాజ్( 43 బతుల్లో 70, 7 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. లంక బౌలర్లలో పతిరానా, అకిలా దనుంజయ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన హసరంగా సేన.. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment