
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆతిథ్య లంక విధించిన 382 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. 55 పరుగులకే అఫ్గన్ ఐదు వికెట్లు కోల్పోయిన వేళ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.
ఒంటరి పోరాటం చేస్తున్న ఐదో నంబర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(149- నాటౌట్)కు తోడైన నబీ.. తన వన్డే కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు. 130 బంతులు ఎదుర్కొన్న అతడు 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు సాధించాడు.
ఒమర్జాయ్‌తో కలిసి అరుదైన రికార్డు
ఈ క్రమంలో ఒమర్జాయ్‌తో కలిసి అరుదైన ఘనత సాధించిన నబీ.. తన అద్భుత శతకంతో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డునూ బద్దలు కొట్టాడు. కాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్- మహ్మద్ నబీ కలిసి 242 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అఫ్గనిస్తాన్ తరఫున ఆరో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
సచిన్‌కు ఎంతో ప్రత్యేకం ఆ సెంచరీ
ఇక మహ్మద్ నబీ 39 ఏళ్ల 39 రోజుల వయసులో ఈ వన్డే సెంచరీ సాధించాడు. తద్వారా.. అత్యధిక వయసులో వన్డేల్లో శతకం బాదిన క్రికెటర్ల జాబితాలో సచిన్‌ను అధిగమించాడు.
2012లో బంగ్లాదేశ్‌తో మిర్పూర్ వన్డేలో.. 38 ఏళ్ల 327 రోజుల వయసులో సచిన్ టెండుల్కర్ సెంచరీ చేశాడు. అతడి అంతర్జాతీయ కెరీర్‌లో అదే వందో శతకం కావడం విశేషం.
జాబితాలో ముందున్నది వీళ్లే
ఇదిలా ఉంటే.. అత్యధిక వయసులో వన్డే శతకం సాధించిన జాబితాలో ఖుర్రం ఖాన్(132 రన్స్- యూఏఈ- 43 ఏళ్ల 162 రోజులు), సనత్ జయసూర్య(107 రన్స్- శ్రీలంక- 39 ఏళ్ల 212 రోజులు), క్రిస్ గేల్(162 రన్స్- 39 ఏళ్ల 159 రోజులు), ఎడ్ జోయిస్(116 రన్స్- 39 ఏళ్ల 111 రోజులు), జెఫ్రీ బాయ్‌కాట్(105- రన్స్- 39 ఏళ్ల 51 రోజులు) నబీ కంటే ముందున్నారు. కాగా శ్రీలంకతో తొలి వన్డేలో ఒమర్జాయ్, నబీ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 42 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment