![Hardik Pandya In BCCI Plans To Reduce Rohit Work Load Says Selector Report - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/28/Rohit.jpg.webp?itok=gAdhglqM)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
India T20 Captain: పనిభారం తగ్గించేందుకు రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ నుంచి విముక్తి కల్పిస్తున్నారా? అతడి స్థానంలో మరో ఆటగాడికి పగ్గాలు అప్పజెప్పుతున్నారా? అంటే కాదు అనే సమాధానాలే వినిపిస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి విశ్వసనీయ వర్గాల నుంచి! అయితే, వరుస సిరీస్‌లు ఉన్నపుడు మాత్రం రోహిత్‌కు విశ్రాంతి కల్పించేందుకు అతడి స్థానంలో ఇకపై స్టార్ ఆల్‌రౌండర్‌కు బాధ్యతలు అప్పగించే యోచనలో ఉందట బీసీసీఐ!
మొదటి మ్యాచ్‌లోనే ఘన విజయంతో
ఇంతకీ ఎవరా ఆల్‌రౌండర్? ఐపీఎల్-2022తో తొలిసారిగా కెప్టెన్‌గా ప్రయాణం ప్రారంభించాడు హార్దిక్ పాండ్యా. తొలి సీజన్‌లోనే తన జట్టు గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌కు సారథిగా ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్‌లోనే 7 వికెట్ల తేడాతో జట్టును గెలిపించి మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు.
హార్దిక్ పాండ్యా
మరోవైపు.. అదే సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఇక టీ20 ప్రపంచకప్-2022 తర్వాత టీమిండియా పలు వరుస టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో బిజీ షెడ్యూల్ కారణంగా రోహిత్‌కు బ్రేక్ ఇస్తే అతడి స్థానంలో ఇకపై పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడట!
కేవలం టీ20 మ్యాచ్‌లకేనా?
ఈ మేరకు సెలక్షన్ కమిటీ సభ్యుడు ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ స్థానాన్ని ఇప్పటికిప్పుడు వేరే ఆటగాడితో భర్తీ చేసే అవకాశమే లేదు. అయితే, తనపై పని ఒత్తిడిని తగ్గించే మార్గాలు అన్వేషిస్తున్నాం. ఇందులో భాగంగానే హార్దిక్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొన్ని టూర్లకు కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది.
అయితే, టెస్టుల విషయంలో మాత్రం అతడి పేరు మా ప్రణాళికల్లో లేదు’’ అని పేర్కొన్నారు. కాగా రోహిత్ శర్మకు పనిభారాన్ని తగ్గించే క్రమంలో టీ20 కెప్టెన్సీ వేరే వాళ్లకు ఇవ్వాలంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెలక్షన్ కమిటీ మెంబర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
చదవండి: ENG_W vs SA-W: టెస్టుల్లో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్.. 61 ఏళ్ల రికార్డు బద్దలు..!
Comments
Please login to add a commentAdd a comment