పూణే వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫార్మాట్ ఏదైనా బౌలర్లు నో బాల్స్ వేయడం పెద్ద నేరమని అన్నాడు. ఈ మ్యాచ్‌లో నో బాల్సే తమ కొంపముంచాయని పేర్కొన్నాడు. కేవలం నో బాల్స్ కారణంగా తాము ఓటమిపాలయ్యామని తెలిపాడు. అర్షదీప్ సింగ్ వేసిన నో బాల్స్ (2 ఓవర్లలో 5 నో బాల్స్) వల్లే తాము ఓడామని చెప్పడం తన ఉద్దేశం కాదంటూనే పదేపదే అదే విషయాన్ని ప్రస్తావించాడు.
యువకుడైన అర్షదీప్ తన బేసిక్ ఎరర్స్‌ను సరిదిద్దుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్ పవర్ ప్లేల్లో కొన్ని అనవసర తప్పిదాలు చేశామని, ఈ స్థాయిలో ఇలా చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. ఆటలో అన్నీ మనం అనుకున్నట్లు జరగకపోవడం వాస్తవమే అయినప్పటికీ.. ప్రాధమిక సూత్రాలు మరవడం క్షమించరాని నేరమని అన్నాడు. అక్షర్, స్కై, శివమ్ మావీల పోరాటపటిమను ఈ పందర్భంగా అభినందించాడు.
కాగా, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైన విషయం తెలిసిందే. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment