విరాట్ కోహ్లితో మహ్మద్ రిజ్వాన్ (పాత ఫొటో: PC: ICC/X)
ICC WC 2023- Virat Kohli- Mohammad Rizwan: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డేల్లో 48 శతకాలు పూర్తి చేసుకున్నాడు. తన సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ కూడా సాధ్యంకాని రీతిలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్‌టైం రికార్డుకు చేరవవుతున్నాడు.
వన్డేల్లో గనుక ఈ రన్‌మెషీన్ మరో రెండు శతకాలు బాదితే సచిన్‌ను వెనక్కి నెడతాడు కూడా! ఇక వరల్డ్‌కప్-2023లోనే విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాలని అభిమానులు ఆశపడుతున్నారు. పుట్టినరోజున సచిన్ రికార్డు సమం చేసి.. ఆ తర్వాత దానిని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు ఇండియా టుడేతో మాట్లాడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు కోహ్లి గురించి ప్రశ్న ఎదురుకాగా..
ఆరోజే తను 49వ సెంచరీ చేయాలి
‘‘నవంబరు 5న తన బర్త్‌డేనా? మంచిది.. నిజానికి నాకు ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు.. అయినా.. తనకు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
విరాట్ తన బర్త్‌డే నాడే 49వ వన్డే సెంచరీ సాధించాలి. అంతేకాదు ఈ వరల్డ్‌కప్‌లోనే 50వ శతకం కూడా పూర్తి చేసుకోవాలి’’ అని ఆకాంక్షించాడు. విరాట్ కోహ్లికి ఆ సత్తా ఉందని రిజ్వాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
కాగా నవంబరు 5న కోహ్లి బర్త్‌డే అన్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆరోజే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లి తన కెరీర్‌లో అరుదైన ఘనత సాధించాలని రిజ్వాన్ కోరుకోవడం విశేషం.
ఈడెన్ గార్డెన్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు..
విరాట్ కోహ్లి పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసేందుకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(CAB) ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు క్యాబ్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ మాట్లాడుతూ..
ప్రత్యేకంగా 70 వేల మాస్కులు
‘‘విరాట్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నాం. ఈ విషయంలో ఐసీసీ నుంచి మాకు అనుమతి వస్తుందనే అనుకుంటున్నాం. స్టేడియానికి వచ్చే ప్రతి అభిమాని కోహ్లి మాస్కులు ధరించేందుకు వీలుగా 70 వేల మాస్కులు పంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం’’ అని తెలిపాడు. కాగా సౌతాఫ్రికాతో కంటే ముందు టీమిండియా శ్రీలంకతో మ్యాచ్ ఆడనుంది.
అంతకంటే ముందే సెంచరీ కావాలి
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు పోటీపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌లోనే కోహ్లి సెంచరీ కొడితే.. బర్త్‌డేన మరో శతకం బాది సచిన్ రికార్డు(49 సెంచరీలు) బద్దలు కొడితే ఇంకా బాగుంటుందని కింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చదవండి: అప్పుడు ద్రవిడ్ నా కోసం రెండు గంటలు ఎదురుచూశాడు.. ఇప్పుడు: షోయబ్ మాలిక్
Comments
Please login to add a commentAdd a comment