#Virushka: అందుకే విరాట్‌ కోహ్లి పేరును రాహుల్‌గా మార్చి మరీ! | Virat Kohli Anushka Anniversary: When Virushka Used Fake Names For Their Wedding | Sakshi
Sakshi News home page

#Virushka Anniversary: అందుకే విరాట్‌ కోహ్లి పేరును రాహుల్‌గా మార్చి మరీ! కేవలం 42 మంది..

Published Mon, Dec 11 2023 10:25 AM | Last Updated on Mon, Dec 11 2023 11:14 AM

Virat Kohli Anushka Anniversary: When Virushka Used Fake Names For Their Wedding - Sakshi

విరుష్క పెళ్లినాటి ఫొటో (PC: Anushka Sharma-Virat Kohli /Instagram)

సరిగ్గా ఆరేళ్ల క్రితం.. ఇదే రోజున.. టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి- బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మతో కలిసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటలు ఎక్కించి చిరకాల ప్రేయసితో కలిసి ఏడడుగులు నడిచాడు.

ఇటలీలోని టస్కనీ వేదికగా ‘విరుష్క’ వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రుల ఆశీర్వాదాలతో డిసెంబరు 11న విరాట్‌- అనుష్క ఒక్కటయ్యారు. షాంపూ యాడ్‌ ద్వారా 2013లో పరిచయమైన వీరిద్దరు చాన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన విషయం తెలిసిందే.

అయితే, చాలా మంది సెలబ్రిటీల లాగే వీరి బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందంటూ వదంతులు వ్యాప్తి చేసిన వారి మాటలను నీటి మూటలు చేస్తూ విరుష్క వెడ్‌లాక్‌తో ముడిపడిపోయారు. కాగా విరాట్‌- అనుష్క జోడీ పబ్లిసిటీకి కాస్త దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా .. రహస్యంగా పెళ్లి తంతు ముగించేశారు.

విరాట్‌ కాదు రాహుల్‌!
ఈ విషయం గురించి అనుష్క శర్మ గతంలో వోగ్‌తో మాట్లాడుతూ.. కేవలం 42 మంది అతిథుల సమక్షంలో విరాట్‌- తాను ఒక్కటయ్యామని తెలిపింది. అంతేకాదు విరాట్‌ కోహ్లికి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా తమ పెళ్లి వార్త లీక్‌ కాకుండా నకిలీ పేరు వాడినట్లు వెల్లడించింది.

‘‘మేము నిరాడంబరంగా.. హోమ్‌ స్టైల్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలని భావించాం. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి మొత్తం ఆరోజు 42 మంది ఉన్నారు. అదొక సెలబ్రిటీ జంట పెళ్లిగా కాకుండా.. కేవలం విరాట్‌- అనుష్కల పెళ్లిలా ఉండాలని కోరుకున్నాం.

అంతేకాదు కేటరర్‌ విషయంలో విరాట్‌ పేరు బయటికి రాకుండా అతడికి ‘రాహుల్‌’ అనే నకిలీ పేరును వాడాం. ప్రేమతో రెండు మనసులు ఏకమయ్యే వేడుకకు పబ్లిసిటీ అవసరం లేదని భావించాం. అందుకే హంగూఆర్భాటాలు లేకుండా పవిత్రత, శాంతితో కూడిన వాతావరణంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం’’ అని అనుష్క శర్మ తెలిపింది.

అప్పటికే టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌
పెళ్లినాటికి టీమిండియా సారథిగా విరాట్‌ కోహ్లి- నటిగా అనుష్క శర్మ తమ కెరీర్‌లో తారస్థాయిలో ఉన్నారు. అయితే, వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే తలంపుతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

మీడియాకు దూరంగా వామిక
ఇక ఈ జంటకు 2021, జనవరి 11న కూతురు జన్మించింది. పాపకు వామికా కోహ్లిగా నామకరణం చేసిన విరుష్క... ఇంతవరకు ఆమె ఫేస్‌ను మాత్రం రివీల్‌ చేయలేదు. పబ్లిసిటీకి దూరంగా.. స్టార్‌ కిడ్‌గా కాకుండా సాధారణ అమ్మాయిలా తమ కుమార్తెను పెంచాలనే ఉద్దేశంతోనే ఆమెను మీడియాకు దూరంగా ఉంచుతున్నట్లు ఇప్పటికే విరుష్క జోడీ వెల్లడించింది.

రికార్డుల రారాజు.. వరల్డ్‌కప్‌ ఓటమితో
కాగా రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి వన్డే వరల్డ్‌కప్‌-2023 టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో కోహ్లి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలో సెలవులు తీసుకున్న కోహ్లి భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి లండన్‌ టూర్‌కు వెళ్లాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా ఈ రన్‌మెషీన్‌ డిసెంబరు 26న మైదానంలో దిగే అవకాశం ఉంది.

చదవండి: క్రికెట్‌ రికార్డుల రారాజు అతడు.. ప్రతిభావంతురాలైన నటి ఆమె.. అప్పుడప్పుడు అతడూ ‘నటిస్తుంటాడు’.. అదే వారి చూపుల కలయికకు కారణమైంది.. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది.. అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయినీ ఇచ్చింది........   Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్‌ జోక్‌’తో మాట కలిపి!.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement