నా దృష్టిలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అతడే: టీమిండియా మాజీ బ్యాటర్‌ | WC 2023: My Player of the Match would have been Ravindra Jadeja, says Aakash Chopra - Sakshi
Sakshi News home page

WC 2023: కోహ్లి కాదు! నా వరకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అతడే: టీమిండియా మాజీ బ్యాటర్‌

Nov 6 2023 11:57 AM | Updated on Nov 6 2023 1:04 PM

WC 2023 My Player of the Match Would Have Been Ravindra Jadeja: Aakash Chopra - Sakshi

ICC WC 2023- Ind vs SA: ‘‘రవీంద్ర జడేజా.. టేక్‌ ఏ బో! చెన్నైలో మూడు వికెట్లు పడగొట్టాడు.. ఇప్పుడు ఇక్కడ ఐదు వికెట్లు. ఇలాంటి పిచ్‌లపై జడ్డూ ఏమాత్రం అవకాశం దొరికినా చెలరేగిపోతాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేస్తాడు.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ విషయంలో నా ఆప్షన్‌ రవీంద్ర జడేజానే. నేనైతే కచ్చితంగా అతడినే ఎంచుకుంటాను’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా టీమిండియా ఆదివారం సౌతాఫ్రికాతో తలపడిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది.

కోహ్లి అజేయ శతకం
ఓపెనర్లు రోహిత్‌ శర్మ(40), శుబ్‌మన్‌ గిల్‌(23) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ చేరగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(77)తో మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఆఖర్లో సూర్యకుమార్‌ యాదవ్‌(14 బంతుల్లో 22 పరుగులు), రవీంద్ర జడేజా(15 బంతుల్లో 29 పరుగులు) మెరుపు​ ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 326 పరుగులు సాధించింది.

జడ్డూ ఐదు వికెట్లు పడగొట్టి
ఈ క్రమంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. టీమిండియా పేసర్లు, స్పిన్నర్ల సమిష్టి ప్రదర్శన కారణంగా 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

కాగా ఈ మ్యాచ్‌లో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సౌతాఫ్రికా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనానికి పునాది వేస్తే స్పిన్నర్‌ రవీంద్ర జడేజా అత్యధికంగా 5 వికెట్లు కూల్చి కోలుకోలేని దెబ్బకొట్టాడు. మిగతావాళ్లలో పేసర్‌ షమీకి రెండు, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఈ నేపథ్యంలో టీమిండియా- సౌతాఫ్రికా మ్యాచ్‌ ఫలితాన్ని విశ్లేషించిన కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా.. తానైతే జడ్డూకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఇచ్చేవాడినని అభిప్రాయపడ్డాడు. ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ..

చాలా సెంచరీలు ఉన్నాయి
‘‘ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు చాలా మంది సెంచరీలు చేశారు. వేగవంతమైన శతకాలు నమోదయ్యాయి. కానీ చాలా తక్కువ మంది ఐదు వికెట్ల హాల్‌ నమోదు చేశారు. నిజానికి బౌలింగ్‌లో ఇలాంటి గణాంకాలు సాధించడం చాలా అరుదు. అందుకే నా ఆప్షన్‌ రవీంద్ర జడేజానే’’ అని మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా తన అభిప్రాయం పంచుకున్నాడు.

కాగా ఈ మ్యాచ్‌లో అజేయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని వన్డేల్లో 49వ సెంచరీ  చేసిన విరాట్‌ కోహ్లి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అదే విధంగా టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న అరుదైన రికార్డును సమం చేశాడు.

చదవండి: Virat Kohli: అవును.. కోహ్లి స్వార్థపరుడే! ముమ్మాటికీ స్వార్థపరుడే..!! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement