ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్లో ఆస్ట్రేలియాను ముందుండి నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్టీవ్ స్మిత్(Steve Smith) ప్రకటించాడు. ప్యాట్ కమిన్స్(Pat Cummins) అందుబాటులోకి రాకపోతే కెప్టెన్సీ చేపట్టేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
అయితే, ఈ మెగా ఈవెంట్‌కు ముందు ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌తో పాటు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయాల బారిన పడగా.. కెప్టెన్ కమిన్స్ కూడా చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురు ఐసీసీ టోర్నీకి అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్వయంగా ధ్రువీకరించాడు.
చారిత్రాత్మక విజయం
కాగా టీమిండియాతో స్వదేశంలో ప్రతిష్టాత్మ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో చారిత్రాత్మక విజయం అందుకున్నాడు ప్యాట్ కమిన్స్. పదేళ్ల తర్వాత ఈ సిరీస్ గెలిచి తన కెప్టెన్సీ రికార్డులలో ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నాడు.
ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన కమిన్స్... చీలమండ గాయానికి చికిత్స చేయించుకుంటున్నాడు. అదే విధంగా తన భార్య తమ రెండో సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో శ్రీలంక పర్యటనకు కూడా దూరంగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో కమిన్స్ స్థానంలో మాజీ సారథి స్మిత్ లంక టూర్‌లో ఆస్ట్రేలియా జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కమిన్స్ ఇంకా కోలుకోలేదని హెడ్‌కోచ్ మెక్‌డొనాల్డ్ బుధవారం వెల్లడించాడు.
చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అసాధ్యం
‘కమిన్స్ పూర్తిగా కోలుకోలేదు. ఇప్పటి వరకు ఇంకా శిక్షణ కూడా మొదలు పెట్టలేదు. ఇలాంటి స్థితిలో అతడు నేరుగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అసాధ్యం. మరోవైపు.. పేసర్ హాజల్‌వుడ్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు’ అని మెక్‌డొనాల్డ్ తెలిపాడు.
ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీలో స్టీవ్ స్మిత్ లేదంటే ట్రవిస్ హెడ్ ఆస్ట్రేలియా సారథులుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ విషయంపై స్పందించిన స్మిత్ మెగా టోర్నీలో నాయకుడిగా ఉండేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మనసులోని మాటను వెల్లడించాడు. ‘‘ఈ విషయం గురించి నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
సారథిగా ఉండటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తా
అయితే, జట్టు గురించి పూర్తి అప్‌డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం నేను టెస్టు సిరీస్ మీద దృష్టి సారించాను. ఈ సిరీస్ గెలిచిన తర్వాత వన్డేలపైకి దృష్టి మళ్లిస్తాం. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్సీ చేయడం నాకు మరింత ఇష్టం.
ఆటపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న విషయంపై స్పష్టత ఉంది. పరిస్థితులకు తగ్గట్లుగా పావులు కదపడాన్ని నేను ఎంతగానో ఇష్టపడతా. సారథిగా ఉండటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తా’’ అని స్టీవ్ స్మిత్ తెలిపాడు.
కాగా శ్రీలంక పర్యటనలో భాగంగా తొలుత టెస్టు సిరీస్ జరుగుతోంది. గాలెలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య లంక జట్టును ఆస్ట్రేలియా ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో స్మిత్ అద్భుత శతకం(141)తో మెరిశాడు.
ఇక ఇరుజట్ల మధ్య అదే వేదికపై గురువారం ఆఖరిదైన రెండో టెస్టు మొదలైంది. అనంతరం లంక- ఆసీస్ మధ్య రెండు వన్డేలు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.
చాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్(ప్రాథమిక) జట్టు..
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
చదవండి: Rohit Sharma: బుమ్రా గాయంపై అప్‌డేట్.. వరుణ్ చక్రవర్తి పోటీలో ఉంటాడు!
Comments
Please login to add a commentAdd a comment