ICC Player Of The Month: 2023, ఫిబ్రవరి నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (మార్చి 13) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఇంగ్లండ్ అప్‌కమింగ్ స్టార్ హ్యారీ బ్రూక్ గెలుచుకున్నాడు. 3 నెలల వ్యవధిలో బ్రూక్ ఈ అవార్డును సొంతం చేసుకోవడం ఇది రెండోసారి. 2022 డిసెంబర్‌లోనూ బ్రూక్ ఈ అవార్డును గెలుచుకున్నాడు.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడు బ్రూక్ మాత్రమే కావడం విశేషం. బాబర్ 2021 ఏప్రిల్‌లో, 2022 మార్చిలో ఈ అవార్డును దక్కించుకున్నాడు. 2023, ఫిబ్రవరిలో బ్రూక్‌కు పోటీగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, విండీస్ యువ స్పిన్నర్ గుడకేశ్ మోటీ పోటీపడినప్పటికీ, అంతిమంగా అవార్డు బ్రూక్‌నే వరించింది.
బ్రూక్.. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో 2 హాఫ్ సెంచరీలు, ఓ భారీ సెంచరీ బాదగా.. జడేజా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్ట్‌ల్లో రెండు ఫైఫర్లతో పాటు అతి విలువైన ఓ హాఫ్ సెంచరీ చేశాడు. విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ విషయానికొస్తే.. ఇండియన్ ఆరిజిన్ కలిగిన ఈ స్పిన్ బౌలర్ ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ, మోటీలతో పోలిస్తే, బ్రూక్‌కు ఓటింగ్ శాతం అధికంగా రావడంతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ అవార్డుకు అతన్నే ఎంపిక చేసింది.
ఇక మహిళల ప్లేయర్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ అవార్డు విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డ్‌నర్ ఈ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు కోసం దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్ట్, ఇంగ్లండ్ నాట్ సీవర్ బ్రంట్ పోటీపడినప్పటికీ, గార్డ్‌నర్‌నే అవార్డు వరించింది. బ్రూక్, బాబర్ తరహాలోనే గార్డ్‌నర్ కూడా ప్లేయర్ అఫ్ ద మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకుంది. 2022 డిసెంబర్‌లో తొలిసారి ఈ అవార్డుకు ఎంపికైన గార్డ్‌నర్, 2023 ఫిబ్రవరిలో రెండో సారి ఐసీసీ అవార్డను గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment