ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్‌కు చేరింది. బంగ్లాదేశ్‌పై 100 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తర్వాత సెమీస్ చేరిన మూడో జట్టుగా హీథర్‌నైట్ బృందం నిలిచింది. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్‌టన్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో ఆదిలోనే డానియెల్ వ్యాట్(6) వికెట్ కోల్పోయినప్పటికీ... ఓపెనర్ బీమౌంట్ 33 పరుగులతో పర్వాలేదనిపించింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ హీథర్‌నైట్ సైతం 6 పరుగులకే నిష్క్రమించడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటర్ నటాలీ సీవర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. 40 పరుగులతో రాణించింది.
మరోవైపు వికెట్ కీపర్ అమీ జోన్స్ ఆమెకు అండగా నిలబడింది. ఇక 72 బంతుల్లో 67 పరుగులు సాధించిన సోఫియా డంక్లే ఇంగ్లండ్ మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖర్లో బ్రంట్ 24, ఎక్లెస్‌స్టోన్ 17 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు షమీమా సుల్తానా, షర్మిన్ అక్తర్ చెరో 23 పరుగులు సాధించి శుభారంభం అందించారు.
అయితే మిడిలార్డర్ దీనిని కొనసాగించలేకపోయింది. దీంతో 48 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి బంగ్లా జట్టు ఆలౌట్ అయింది. దీంతో విజయం ఇంగ్లండ్ సొంతమైంది. సరిగ్గా వంద పరుగుల తేడాతో హీథర్‌నైట్ బృందం గెలుపొందింది. విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ బ్యాటర్ సోఫియా డంక్లేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే ఇంగ్లండ్‌తో పాటు టాప్-4లో నిలుస్తుంది.
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప- 2022
ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు
ఇంగ్లండ్- 234/6 (50)
బంగ్లాదేశ్- 134 (48)
Comments
Please login to add a commentAdd a comment