‘స్వీట్‌ స్వియాటెక్‌’ | Iga Swiatek Steamrolls Sofia Kenin to Win the French Open | Sakshi
Sakshi News home page

‘స్వీట్‌ స్వియాటెక్‌’

Published Sun, Oct 11 2020 5:26 AM | Last Updated on Sun, Oct 11 2020 5:26 AM

Iga Swiatek Steamrolls Sofia Kenin to Win the French Open - Sakshi

పారిస్‌ గడ్డపై పోలండ్‌ గర్ల్‌ మెరిసింది... తొలి మ్యాచ్‌నుంచి ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా దూసుకొచ్చిన ఇగా స్వియాటెక్‌ చివరి వరకు అదే జోరు కొనసాగించి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను అందుకొని కొత్త చరిత్ర సృష్టించింది. విజేతగా నిలిచే క్రమంలో ఎన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకున్న 19 ఏళ్ల ఈ అమ్మాయి ఆనందానికి ఎర్ర మట్టి కోట వేదికైంది. మరో వైపు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన సోఫియా కెనిన్‌ మాత్రం ఏమాత్రం పోరాటం ప్రదర్శించకుండా పరాజయంపాలైంది.  

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను ఇగా స్వియాటెక్‌ (పోలండ్‌) గెలుచుకుంది. శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో స్వియాటెక్‌ 6–4, 6–1 తేడాతో నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా)ను చిత్తు చేసింది.  గంటా 24 నిమిషాల్లో ఈ మ్యాచ్‌ ముగిసింది. ఈ టోర్నీకి ముందు 54వ ర్యాంక్‌తో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన పోలండ్‌ ప్లేయర్‌ తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 16 లక్షల యూరోలు (సుమారు రూ. 13 కోట్ల 82 లక్షలు), రన్నరప్‌గా నిలిచిన కెనిన్‌కు 8 లక్షల యూరోలు (సుమారు రూ. 7 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

అలవోకగా...  
మ్యాచ్‌ ఆరంభంనుంచే ఆధిపత్యం ప్రదర్శించిన స్వియాటెక్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 3–0తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. అయితే కోలుకున్న కెనిన్‌ పట్టుదలగా ఆడటంతో స్కోరు 3–3కు చేరింది. ఈ దశలో మళ్లీ బ్రేక్‌ సాధించిన పోలండ్‌ అమ్మాయి 5–3తో ముందంజ వేసింది. తర్వాతి గేమ్‌ను కెనిన్‌కు కోల్పోయినా మరుసటి గేమ్‌లో మళ్లీ చెలరేగి సెట్‌ను గెలుచుకుంది. రెండో సెట్‌లో ఆమెకు తిరుగులేకుండా పోయింది. తొలి గేమ్‌లో స్వియాటెక్‌ సర్వీస్‌ను కెనిన్‌ బ్రేక్‌ చేసి 1–0తో ఆధిక్యం సాధించింది. అయితే ఇక్కడినుంచి ఇగా చెలరేగిపోయింది. వరుసగా ఆరు గేమ్‌లు గెలుచుకొని టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇగా షాట్లకు ప్రత్యర్థి వద్ద సమాధానం లేకపోయింది. తుది పోరులో స్వియాటెక్‌ 25 విన్నర్లు కొట్టగా 17 అన్‌ఫోర్స్‌డ్‌ ఎర్రర్స్‌ మాత్రమే చేసింది.

స్వియాటెక్‌ ఘనతలివీ...
► పోలండ్‌ తరఫున గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి మహిళ  
► అన్‌సీడెడ్‌గా దిగి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన రెండో మహిళ
► గత 40 ఏళ్లలో పురుషుల, మహిళల విభాగాల్లో కెరీర్‌లో తొలి టైటిల్‌గా గ్రాండ్‌స్లామ్‌ను గెలిచిన నాలుగో క్రీడాకారిణి
► మోనికా సెలెస్‌ (18 ఏళ్ల 187) రోజుల తర్వాత పిన్న వయసులో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన (19 ఏళ్ల 132 రోజులు) మహిళ.
► 1975 తర్వాత ఇంత తక్కువ ర్యాంక్‌ (54) ఉన్న క్రీడాకారిణి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలవడం ఇదే మొదటిసారి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement