ఇగా స్వియాటెక్, సోఫియా కెనిన్
పారిస్: ఏమాత్రం అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన పోలాండ్ టీనేజర్ ఇగా స్వియాటెక్ కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఈ అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 19 ఏళ్ల స్వియాటెక్ 70 నిమిషాల్లో 6–2, 6–1తో క్వాలిఫయర్, 131వ ర్యాంకర్ నదియా పొడొరోస్కా (అర్జెంటీనా)పై గెలుపొందింది. తద్వారా ఓపెన్ శకంలో (1968 నుంచి) ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలి పోలాండ్ క్రీడాకారిణిగా నిలిచింది. 1968కు ముందు ఫ్రెంచ్ చాంపియన్‌షిప్ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీలో 1939లో పోలాండ్ క్రీడాకారిణి జద్విగా జెద్రెజౌస్కా ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. 2012లో అగ్నెస్కా రద్వాన్‌స్కా వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాక మరో పోలాండ్ క్రీడాకారిణి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరడం ఇదే ప్రథమం.
ఫైనల్ చేరే క్రమంలో స్వియాటెక్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. అన్‌సీడెడ్ హోదాలో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన ఏడో క్రీడాకారిణిగా స్వియాటెక్ గుర్తింపు పొందింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 54వ స్థానంలో ఉన్న స్వియాటెక్ ఇప్పటివరకు మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టూర్ టైటిల్ నెగ్గకపోవడం గమనార్హం. 1975లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తక్కువ ర్యాంకర్ స్వియాటెక్ కావడం విశేషం. శనివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా)తో స్వియాటెక్ అమీతుమీ తేల్చుకుంటుంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన తొలి మహిళా క్వాలిఫయర్‌గా రికార్డు నెలకొల్పిన నదియా పొడొరోస్కా కీలకమ్యాచ్‌లో తేలిపోయింది. స్వియాటెక్ దూకుడైన ఆటకు సమాధానం ఇవ్వలేక పొడొరోస్కా మ్యాచ్‌లో కేవలం మూడు గేమ్‌లు గెలిచి సంతృప్తి పడింది. స్వియాటెక్ ఏకంగా 23 విన్నర్స్ కొట్టగా... పొడొరోస్కా కేవలం ఆరింటితో సరిపెట్టుకుంది. ఇద్దరూ 20 చొప్పున అనవసర తప్పిదాలు చేసినా స్వియాటెక్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తుది ఫలితాన్ని శాసించింది. 1983 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇద్దరు అన్‌సీడెడ్ క్రీడాకారిణుల మధ్య సెమీఫైనల్ జరగడం ఇదే తొలిసారి.
సోఫియా శ్రమించి...
ఇద్దరు సీడెడ్ క్రీడాకారిణుల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ 6–4, 7–5తో ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సోఫియా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 40 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్న సోఫియాకు రెండో సెట్‌లో గట్టిపోటీనే లభించింది. రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన క్విటోవా రెండో సెట్‌లో ఒకదశలో 3–5తో వెనుకబడింది. ఆ తర్వాత సోఫియా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఆమె స్కోరును 5–5తో సమం చేసింది. కానీ 11వ గేమ్‌లో క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సోఫియా ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
జొకోవిచ్ పదోసారి సెమీస్‌కు...
బుధవారం రాత్రి ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ చివరి క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 4–6, 6–2, 6–3, 6–4తో 17వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)పై గెలుపొందాడు. పదోసారి ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి సెట్‌ను కోల్పోయినా పట్టుదలతో పోరాడి ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లలో నెగ్గి ఐదో సీడ్ సిట్సిపాస్‌తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment