ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2025 ఎడిషన్‌లో రెండో సెంచరీ నమోదైంది. షార్జా వైపర్స్‌తో నిన్న (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ ఆటగాడు టామ్ బాంటన్ శతక్కొట్టాడు. ఐఎల్‌టీ20 (ILT20) చరిత్రలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తరఫున ఇదే తొలి సెంచరీ.
బాంటన్‌కు ముందు ఐఎల్‌టీ20లో కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీలు చేశారు. లీగ్ చరిత్రలో తొలి సెంచరీని టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్ (షార్జా వారియర్స్) చేయగా.. రెండో సెంచరీని అలెక్స్ హేల్స్ (డెజర్ట్ వైపర్స్) చేశాడు. లీగ్‌లో మూడో సెంచరీ ఇదే సీజన్‌లో నమోదైంది. సీజన్ నాలుగో మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌పై షాయ్ హోప్ (దుబాయ్ క్యాపిటల్స్) శతక్కొట్టాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. షార్జా వారియర్స్‌పై ఎంఐ ఎమిరేట్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా వారియర్స్, ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ (42 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ అవిష్క ఫెర్నాండో (17 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
వీరిద్దరూ మినహా వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. లూక్ వెల్స్ (18), కరీమ్ జనత్ (18), ఎథన్ డిసౌజా (11) రెండంకెల స్కోర్లు చేశారు. జేసన్ రాయ్ (1), రోహన్ ముస్తఫా (6), కీమో పాల్ (4), కెప్టెన్ సౌథీ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ రెండు, రొమారియో షెపర్డ్, వకార్ సలామ్‌కిల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం బరిలోకి దిగిన ఎంఐ ఎమిరేట్స్ 17.4 ఓవర్లలో ఆడుతూపాడుతూ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎమిరేట్స్ ఆదిలోనే ముహమ్మద్ వసీం (12) వికెట్ కోల్పోయినా, టామ్ బాంటన్ (55 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ కుసాల్ పెరీరా (42 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.
వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయమైన 157 పరుగులు జోడించారు. ఐఎల్‌టీ20లో ముంబై ఇండియన్స్ తరఫున ఇదే అత్యధిక భాగస్వామ్యం. లీగ్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఐఎల్‌టీ20లో డెసర్ట్ వైపర్స్ ఆటగాళ్లు కొలిన్ మున్రో, అలెక్స్ హేల్స్ నెలకొల్పిన 164 పరుగుల భాగస్వామ్యం ఏ వికెట్‌కైనా అత్యధికం. 2023 సీజన్‌లో మున్రో, హేల్స్ ఈ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ గెలుపుతో ఎమిరేట్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
Comments
Please login to add a commentAdd a comment