ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ రోజురోజుకు మెరుగు అవుతున్నాడని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. పెర్త్ టెస్టుకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు.
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది. శుక్రవారం నుంచి ఈ మెగా సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఆసీస్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతోంది.
ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గిల్ ఎడమ బొటన వేలికి గాయం అయింది. అయితే, బౌలింగ్ కోచ్ మోర్కెల్ అందించిన సమాచారం ప్రకారం.. గిల్ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.
బలహీనంగా టాపార్డర్
ఇదిలా ఉంటే.. ఇప్పటికే వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం కావడంతో... టాపార్డర్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో గిల్ కూడా మ్యాచ్ ఆడకపోతే జట్టుకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు
ఈ నేపథ్యంలో చివరి వరకు వేచి చూసే ధోరణి అవలభించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మ్యాచ్ రోజు వరకు గిల్ ఫిట్‌నెస్ సాధించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ‘గిల్ రోజు రోజుకు మెరుగవుతున్నాడు. టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నాడు.
ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీ చేయబోతున్న బుమ్రా గురించి మోర్కెల్ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా పిచ్‌లపై బుమ్రాకు మంచి అనుభవం ఉంది. నాయకత్వ బృందంలో బుమ్రా కూడా భాగం. అతడు గతంలో ఇక్కడ చాలా మంచి ప్రదర్శనలు చేశాడు. జట్టును ముందుండి నడిపించడాన్ని ఇష్టపడే బౌలర్ అతడు. మిగిలిన వాళ్లు అతడిని అనుసరిస్తారు’ అని తెలిపాడు.
ఒత్తిడిని దరిచేరనివ్వం...
ఇక స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో టెస్టు సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో భారత జట్టు ఒత్తిడిలో ఉందని అంతా అనుకుంటున్నారని... అయితే దాన్ని మార్చి వేసుకునేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు మించింది లేదని మోర్కెల్ అన్నాడు.
ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియాలో రాణిస్తే వచ్చే పేరు ప్రఖ్యాతులు వేరని పేర్కొన్నాడు. ‘ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు అని అడుగుతున్నారు. మా వరకు దాన్ని పక్కన పెట్టేసి మెరుగైన ప్రదర్శనపైనే దృష్టి పెట్టాం’ అని మోర్కెల్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment