ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్
టీమిండియాతో రెండో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలిపింది. ఇక పెర్త్ టెస్టుతో అరంగేట్రం చేసిన నాథన్ మెక్‌స్వీనీని కొనసాగించింది. ఉస్మాన్ ఖవాజాతో పాటు అతడు మరోసారి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది.
అయితే, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఫిట్‌గా ఉండటంతో అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కగా.. బ్యూ వెబ్‌స్టర్‌కు మొండిచేయి ఎదురైంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.
పింక్ బాల్‌తో
ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో బుమ్రా సారథ్యంలోని భారత్.. ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ క్రమంలో.. గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియా అడిలైడ్‌లో ఆసీస్‌తో రెండో టెస్టు ఆడేందుకు సన్నద్ధమైంది. పింక్ బాల్‌తో నిర్వహించే ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. శుబ్‌మన్ గిల్ కూడా అందుబాటులోకి వచ్చాడు.
మరోవైపు.. ఆస్ట్రేలియా మాత్రం జోష్ హాజిల్‌వుడ్ రూపంలో కీలక పేసర్ సేవలు కోల్పోయింది. తొలి టెస్టు అనంతరం అతడికి పక్కటెముకల నొప్పి తీవ్రం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు.. మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ కూడా అందుబాటులో ఉంటారో లేదోనన్న అనుమానాలు నెలకొనగా.. క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం స్పష్టతనిచ్చింది.
68 పరుగులకే టీమ్‌ను అవుట్ చేయడంలో కీలక పాత్ర
భారత్‌తో పింక్ బాల్ టెస్టులో వీరిద్దరు ఆడతారని పేర్కొంది. కాగా హాజిల్‌వుడ్ స్థానంలో ఆడబోయే స్కాట్ బోలాండ్ 2021-22 యాషెస్ సిరీస్‌లో మూడో టెస్టు సందర్భంగా అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు చూపించి 6/7తో రాణించి.. 68 పరుగులకే టీమ్‌ను అవుట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పటి వరకు ఈ రైటార్మ్ పేసర్ 10 టెస్టులాడి 35 వికెట్లు కూల్చాడు.
వారికి సెకండ్ ఛాన్స్
ఇదిలా ఉంటే.. రెండో టెస్టు సన్నాహకాల్లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 35 ఏళ్ల బోలాండ్ భాగమయ్యాడు. మరోవైపు.. టీమిండియాతో తొలి టెస్టులో విఫలమైనప్పటికీ నాథన్ మెక్‌స్వీనీ(10, 0)కి ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇచ్చింది. లబుషేన్(2, 3)ను కూడా కొనసాగించింది. ఇక భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.
టీమిండియాతో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి
Comments
Please login to add a commentAdd a comment