‘నన్ను క్షమించు బుమ్రా.. నాకు దురుద్దేశం లేదు’ | Ind vs Aus: Isa Guha Apologizes to Bumrah on live TV Ravi Shastri Reacts | Sakshi
Sakshi News home page

‘నన్ను క్షమించు బుమ్రా.. నాకు దురుద్దేశం లేదు’

Published Mon, Dec 16 2024 12:31 PM | Last Updated on Mon, Dec 16 2024 1:05 PM

Ind vs Aus: Isa Guha Apologizes to Bumrah on live TV Ravi Shastri Reacts

టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు ఇంగ్లండ్‌ మహిళా జట్టు మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ ఇషా గుహా(Isa Guha) క్షమాపణలు చెప్పారు. బుమ్రాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. దక్షిణ ఆసియా సంతతికి చెందిన తాను బుమ్రాను ప్రశంసించే క్రమంలో అలాంటి పదం వాడటం తప్పేనని అంగీకరించారు.

బ్రిస్బేన్‌లో మూడో టెస్టు
బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ 204-25లో భాగంగా భారత క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో పెర్త్‌ టెస్టులో టీమిండియా, అడిలైడ్‌ పింక్‌ బాల్‌ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా విజయం సాధించాయి. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లో శనివారం మూడో టెస్టు మొదలైంది.

గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు తొలిరోజు వర్షం వల్ల ఆటంకం కలగగా.. రెండో రోజు పూర్తి ఆట కొనసాగింది. ఓవరాల్‌గా ఆదివారం ఆసీస్‌ పైచేయి సాధించినప్పటికీ.. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో కామెంట్రీ ప్యానెల్‌లో ఉన్న ఇషా గుహ.. బుమ్రాను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అతడు మెస్ట్‌ వాల్యూబుల్‌ ప్రైమేట్‌
‘‘అతడు MVP కదా! మీరేమంటారు? నా దృష్టిలో అయితే అతడు మెస్ట్‌ వాల్యూబుల్‌ ప్రైమేట్‌(Most valuable primate)’’ అంటూ సహచర కామెంటేటర్‌ బ్రెట్‌ లీతో ఇషా గుహ వ్యాఖ్యానించారు. నిజానికి క్రికెట్‌ పరిభాషలో అత్యంత విలువైన ఆటగాడు అని ప్రశంసించే సందర్భంలో MVP(Most Valuable Player) అని వాడతారు.

కోతుల గురించి చెప్పేటపుడు
అయితే, ఇషా గుహ ఇక్కడ ప్రైమేట్‌(primate) అనే పదం వాడటంతో వివాదం చెలరేగింది. పాలిచ్చే జంతువులు(క్షీరదాలు).. ఎక్కువగా కోతుల గురించి చెప్పేటపుడు ఈ పదాన్ని వాడతారు. అయితే, బుమ్రాను ఉద్దేశించి ఇషా ఇలా అనడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ‘మంకీ గేట్‌’ వివాదాన్ని గుర్తుచేస్తూ ఇషాపై నెటిజన్లు విరుచుకుపడ్డారు.

నాకు దురుద్దేశం లేదు.. స్పందించిన రవిశాస్త్రి
ఈ నేపథ్యంలో ఇషా గుహ స్పందిస్తూ.. బుమ్రాకు క్షమాపణలు చెప్పడం గమనార్హం. తాను ఉపయోగించిన Primate అనే పదానికి మనుషులనే అర్థం కూడా ఉందని.. ఏదేమైనా తాను అలా అని ఉండకూడదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనకు ఎవరినీ కించపరిచాలనే ఉద్దేశం లేదని.. నిజానికి బుమ్రా ఆట అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.

తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. తాను భేషరుతుగా క్షమాపణ చెబుతున్నానని ఇషా గుహ లైవ్‌ కామెంట్రీలో వివరణ ఇచ్చారు. ఆ సమయంలో పక్కనే ఉన్న టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి.. ‘‘ధైర్యవంతురాలైన మహిళ’’ అంటూ ఇషా గుహను కొనియాడాడు.

మంకీ గేట్‌ వివాదం?
2007-08లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సిడ్నీలో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరిగింది. ఈ సందర్భంగా భారత ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌..  ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ను మంకీ అని సంబోధించాడనే ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయం గురించి నాటి కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ అంపైర్‌కు ఫిర్యాదు చేయగా.. భజ్జీపై తొలుత మూడు మ్యాచ్‌ల నిషేధం విధించారు. అయితే, సచిన్‌ టెండుల్కర్‌ సహా ఇతర ఆటగాళ్లు భజ్జీ.. హిందీలో.. ‘‘మా...కీ’’ అన్నాడని.. మంకీ అనలేదంటూ విచారణలో తెలిపారు. దీంతో విచారణ కమిటీ హర్భజన్‌పై  నిషేధాన్ని ఎత్తివేసింది.

చదవండి: రోహిత్‌ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్‌ చేయండి’
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement