ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఎడిషన్‌లో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సత్తా చాటాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్న వేళ సెంచరీతో ఆదుకున్నాడు.
సొంత మైదానం చెపాక్‌లో నిలకడగా ఆడి 113 పరుగులు సాధించాడు. అంతేకాదు.. అదే మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. ఇలా ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించి.. బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి అశూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
రెండో టెస్టులోనూ అదరగొట్టి
ఇక కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టులోనూ అశ్విన్ అదరగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను తిప్పలుపెట్టి కీలక వికెట్లు కూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజ్ముల్ షాంటో(31), షకీబ్ అల్ హసన్(9) వికెట్లు తీసిన అశూ.. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జకీర్ హసన్(10), మొమినుల్ హక్(2), హసన్ మహమూద్(4)లను పెవిలియన్‌కు పంపాడు. అలా మొత్తంగా రెండో టెస్టులో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ రికార్డు సమం
ఈ మ్యాచ్‌లోనూ భారత్ బంగ్లాపై గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన అశ్విన్‌ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. అశూ టెస్టుల్లో ఈ పురస్కారం అందుకోవడం ఇది పదకొండోసారి కావడం విశేషం. తద్వారా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ చెన్నై బౌలర్ సమం చేశాడు.
మురళీధరన్ కూడా సంప్రదాయ క్రికెట్‌లో 11 సార్లు ఈ అవార్డు గెలిచాడు. కాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో చెన్నై టెస్టులో 280 పరుగుల తేడాతో గెలిచిన రోహిత్ సేన.. కాన్పూర్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టెస్టుల్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన క్రికెటర్లు
ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)- 11 సార్లు
రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 11 సార్లు
జాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా)- 9 సార్లు
సర్ రిచర్డ్ హాడ్లీ(న్యూజిలాండ్)- 8 సార్లు
ఇమ్రాన్ ఖాన్(పాకిస్తాన్)- 8 సార్లు
షేన్ వార్న్(ఆస్ట్రేలియా)- 8 సార్లు.
Comments
Please login to add a commentAdd a comment