టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. సంప్రదాయ క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన ఈ లెఫ్టాండర్.. తాజాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు సందర్భంగా మరో రికార్డు నమోదు చేశాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధ శతకం బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు.
ఈ క్రమంలో భారత డాషింగ్ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను జైస్వాల్ అధిగమించాడు. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై టెస్టులో 280 పరుగులతో గెలిచిన టీమిండియా.. కాన్పూర్ వేదికగా రెండో మ్యాచ్ ఆడుతోంది. గ్రీన్‌పార్క్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌కు తొలిరోజు నుంచే వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో రెండు, మూడో రోజు ఆట రద్దు కాగా.. సోమవారం మ్యాచ్ మళ్లీ మొదలైంది.
ఆది నుంచే దూకుడుగా
ఈ నేపథ్యంలో 107/3 స్కోరుతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 11 బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. 209కి పైగా స్ట్రైక్‌రేటుతో ఆకట్టుకున్నాడు.
టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం ‘బజ్‌బాల్’ తరహా ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో 51 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై బ్యాటర్.. 12 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 72 పరుగులు రాబట్టాడు.
టీమిండియా తరఫున టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకం సాధించినది వీరే
👉రిషభ్ పంత్- బెంగళూరులో 2022 నాటి శ్రీలంకతో మ్యాచ్‌లో 28 బంతుల్లోనే 50 రన్స్
👉కపిల్ దేవ్- కరాచిలో 1982 నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 30 బంతుల్లోనే 50 రన్స్
👉శార్దూల్ ఠాకూర్- ఓవల్‌లో 2021 నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ మీద 31 బంతుల్లోనే 50 రన్స్
👉యశస్వి జైస్వాల్- కాన్పూర్‌లో 2024 నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మీద 31 బంతుల్లోనే 50 రన్స్
👉వీరేంద్ర సెహ్వాగ్- చెన్నైలో 2008 నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ మీద 32 బంతుల్లో 50 రన్స్.
ప్రపంచ రికార్డు
ఇక ధనాధన ఇన్నింగ్స్‌తో అలరించిన రోహిత్ శర్మ- యశస్వి జైస్వాల్ జోడి టెస్టుల్లో హయ్యస్ట్ స్కోరింగ్ రేటు(14.34) పార్ట్‌నర్‌షిప్ సాధించిన తొలి జంటగా అరుదైన ఘనత సాధించింది. ఇద్దరూ కలిసి 23 బంతుల్లోనే 55 పరుగులు సాధించి ఈ ఫీట్ నమోదు చేశారు. వీరి తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ జోడీ బెన్ స్టోక్స్- బెన్ డకెట్(44 బంతుల్లో 87 నాటౌట్), వాగ్నర్- ట్రెంట్ బౌల్ట్(27 బంతుల్లో 52) ఉన్నారు.
చదవండి: రాహుల్ ద్రవిడ్ కుమారుడికి షాక్.. ఇకపై ఆ జట్టుకు ఆడలేడు!
Comments
Please login to add a commentAdd a comment