టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (నవంబర్ 2) జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) సాధించి, సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఆఖరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ ఆసక్తికర సమరంలో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి ప్రత్యర్ధిని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 64 పరుగులు) అర్ధశతకాలతో చెలరేగగా.. ఆతర్వాత భారత పేసర్లు ప్రతికూల పరిస్థితుల నడుమ అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ ఆటను కట్టించారు.
కాగా, ఈ మ్యాచ్‌లో మెరుపు అర్ధశతకం సాధించి టీమిండియా భారీ స్కోర్ సాధించడానికి పునాది వేసిన కేఎల్ రాహుల్‌కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం క్రికెట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు పేలవ ఫామ్‌తో సతమతమై, కాన్ఫిడెన్స్ కోల్పోయిన రాహుల్.. ఒత్తిడిని ఎలా అధిగమించి ట్రాక్‌లో పడాలో కింగ్ కోహ్లి వద్ద సలహాలు తీసుకోవడం నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా మనందరం చూశాం. ఫామ్ లేమి కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాహుల్‌కు కోహ్లి బ్యాటింగ్ పాఠాలు నేర్పడం, దానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియలో వైరల్ కావడం గమనించాం.
రాహుల్.. కోహ్లితో దాదాపు 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత నెట్స్‌లోకి వెళ్లి ప్రాక్టీస్ చేస్తుండగా.. కోహ్లి అక్కడికి కూడా వెళ్లి ఫుట్‌వర్క్ తదితర విషయాలపై సలహాలు ఇవ్వడం పలు వీడియోల్లో వీక్షించాం. బంగ్లాపై టీమిండియా గెలుపు అనంతరం ఈ వీడియోలు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.
కోహ్లి సలహా ఇచ్చాడు.. రాహుల్ ఫామ్‌లోకి వచ్చాడు అంటూ కోహ్లి ఫ్యాన్స్ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. కోహ్లి వీరాభిమానులైతే.. తమ ఆరాధ్య ఆటగాడు రాయితో సైతం పరుగులు చేయించగలడని ఆకాశానికెత్తుతున్నారు. మొత్తానికి చాలాకాలంగా ఫామ్ లేక నానా తంటాలు పడ్డ రాహుల్ ఎట్టకేలకు బంగ్లాతో మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌తో రాహుల్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఫుట్‌వర్క్, షాట్ సెలెక్షన్ తదితర అంశాల్లో పూర్వవైభవం సాధించాడు. రాహుల్‌కు పాఠాలు నేర్పి గట్టెక్కించిన కోహ్లి సైతం ఈ మ్యాచ్‌లో అజేయమైన అర్ధసెంచరీతో మెరిశాడు.
Comments
Please login to add a commentAdd a comment